Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రజత పతకం పోరాటానికి కాసేపట్లో తెరపడనుంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న ఈ కేసులో అర్బిట్రేషన్ కోర్టు (Arbitration Court) తీర్పు మంగళవారం రాత్రి 9: 30 గంటలకు వెలువడనుంది. యావత్ భారతమంతా వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందా? లేదా? అని ఉత్కంఠతో ఉంది. ఈ నేపథ్యంలో అర్బిట్రేషన్ కోర్టులో వినేశ్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాద బృందంలోని విదుష్పత్ సింఘానియా (Vidushapt Singhania) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘సీఏఎస్‌లో మన విజయావకాశలు చాలా తక్కువ. కానీ, వినేశ్ విషయంలో మనందరం చారిత్రాత్మకమైన తీర్పును ఆశిస్తున్నాం. ఇది నిజంగా చాలా కష్టమైనది. అయితే.. ఏదైనా అద్భుతం జరగాలని మనమంతా ఆశిద్దాం’ అని సింఘానియా తెలిపాడు. వినేశ్ కేసును వాదిస్తున్న న్యాయకోవిదుల్లో మాజీ సొలిసిటర్ జనరల్ హరిస్ సాల్వే (Hairsh Salve) కూడా ఉన్నారు. సీఏఎస్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. క్రీడలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంటుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ అంచనాలు అందుకుంటూ ఫైనల్ చేరింది. పసిడి ఫైట్ కాసేపట్లో ఉందనగా నిర్వాహకులు ఆమె బరువు కొలిచారు. అయితే.. 100 గ్రాముల అదనపు బరువు ఉండడంతో వినేశ్‌ను నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో,ఫైనల్ ఆడలేకపోయిన ఆమె అప్పీల్‌పై అర్బిట్రేషన్ కోర్టు (CAS)ను ఆశ్రయించింది. విశ్వ క్రీడల్లో విశేషంగా రాణించిన వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్ ఇస్తామని హర్యానాకు చెందని ఖాప్ పంచాయతీ (Khap Panchayat) ప్రకటించింది.