బడంగ్‌పేట : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy ) డిమాండ్ చేశారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఫించన్లతో పాటు దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కెటాయించామన్నారు. నాడు సకాలంలో పింఛన్లను అందజేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని , ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పనిచేయాలన్నారు. అధికారంలోకి ఎనిమిది మాసాలు గడిచనా హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఈ సందర్భంగా తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మీర్‌పేట అధ్యక్షులు కామేష్ రెడ్డి, బీఆర్ఎస్ తుక్కుగూడ అధ్యక్షుడు లక్ష్మయ్య, బీఆర్ఎస్ మహేశ్వరం నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహన్, లలిత జగన్, నిర్మలారెడ్డి, అంజయ్య తదితరులు ఉన్నారు.