Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్ హీరో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సరదాగా గడుపుతున్నాడు. శ్రీలంక పర్యటనతో పాటు దులీప్ ట్రోఫీ నుంచి కూడా విశ్రాంతి తీసుకున్న ఈ స్పీడ్‌స్టర్ అభిమానులతో చిట్‌చాట్ చేస్తున్నాడు. తాజాగా చెన్నైలో ఓ కాలేజీ ఫంక్షన్‌కు యార్కర్ కింగ్ అతిథిగా వెళ్లాడు. అక్కడి వందలాది మంది విద్యార్థుల సమక్షంలో యాంకర్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. అంతే ఆసక్తికర సమాధానంతో బుమ్రా ఆశ్చర్యపరిచాడు.
‘అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం?’ అనే ప్రశ్నకు అతడు ఏం చెప్పాడంటే.. ‘మీరడిగిన ప్రశ్నకు నేను మంచి జవాబు ఇవ్వాలనుకుంటున్నా. నా తల మీదుగా ఏ బ్యాటర్ సిక్సర్ కొట్టాలని నేను కోరుకోను. అయితే.. నేను ప్రతి ఒక్క ఆటగాడిని గౌరవిస్తాను. కానీ, నా పనిని ఉత్తమంగా చేస్తే.. నన్ను అడ్డుకునే బ్యాటర్ ఎవరూ లేరని నాలో నేను అనుకుంటా. చెప్పాలంటే.. క్రీజులో ఎవరు ఉన్నారు? అనే దానికంటే నన్ను నేను చూసుకుంటా.
Jasprit Bumrah on batters tough to bowl to. 🙇♂️
– Bumrah with a Boom answer! pic.twitter.com/xd06WahoHu
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 29, 2024
నేను అన్ని విషయాలపై నియంత్రణ సాధించినప్పుడు.. నా అత్యుత్తమ ప్రతిభ చూపినప్పుడు.. ప్రతిదీ నాకు అనుకూలంగానే జరుగుతుంది’ అని బుమ్రా చెప్పాడు. అతడి సమాధానం విని యాంకర్‌తో సహా అక్కడ ఉన్నవాళ్లంతా ‘వావ్.. సూపర్’ అటూ చప్పట్లు కొట్టారు.
ప్రపంచంలోనే మేటి బౌలర్‌గా పేరొందని బుమ్రా నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో వికెట్ల వేట కొనసాగించాడు. అదే జోరును టీ20 వరల్డ్ కప్ లోనూ చూపించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ రోహిత్ సేన పని సులువు చేశాడు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు.
దాంతో, టీమిండియా 7 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. రెండోసారి పొట్టిప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ తర్వాత సుదీర్ఘ బ్రేక్ తీసుకున్న బుమ్రా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది.