T20 World Cup 2024 : వరల్డ్ కప్ అంటే చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు. విశ్వ వేదికపై అభిమాన ఆటగాళ్ల విన్యాసాలను, సొంత జట్టు అద్భుత విజయాలను తిలకించి మురిసిపోతారు. ఇప్పుడు దసరాకు ముందే క్రికెట్ మహా జాతర మొదలవ్వనుంది. మరో రెండు రోజుల్లో మహిళల టీ20 వరల్డ్ కప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీలో తొలి ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని భారత మహిళల జట్టు ఎంతో ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఎనిమిది సీజన్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీని పట్టేయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో ఉంది. రెండేండ్ల క్రితం.. 2020లో భారత జట్టును ఫైనల్ చేర్చిన ఆమె ఇప్పుడు కప్‌తోనే తిరిగి స్వదేశం రావాలని కంకణం కట్టుకుంది.
ఐసీసీ టీ20, వన్డే వరల్డ్ కప్.. భారత మహిళల జట్టు ప్రతిసారి గట్టెక్కని పరీక్ష ఇది. గత ఎనిమి సీజనల్లో 2020 మినహీ టీమిండియా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 2020లో ఫైనల్ చేరిన భారత జట్టు ఆస్ట్రేలియాకు తలొంచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటా విఫలమైన అమ్మాయిల బృందం 85 పరుగుల తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి ఎడిషన్‌లో సెమీస్ ముందే టీమిండియా పోరాటం ముగిసింది.
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 🗓️#TeamIndia‘s schedule for the ICC Women’s #T20WorldCup 2024 is 𝙃𝙀𝙍𝙀 🔽 pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
అయితే.. రెండు నెలల క్రితం పొట్టి ప్రపంచ కప్‌తో దేశాన్ని సంబురాల్లో ముంచెత్తిన పురుషుల జట్టును స్ఫూర్తిగా తీసుకొని చరిత్ర సృష్టించాలని హర్మన్‌ప్రీత్ బృందం భావిస్తోంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్ కప్ వేటను మొదలెట్టనుంది.
గ్రూప్ ‘ఏ’లో ఉన్న భారత్‌కు కఠిన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. తొలి ట్రోఫీ కోసం చకోర పక్షిలా నిరీక్షిస్తున్న టీమిండియాకు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. లీగ్ దశలో హర్మన్‌ప్రీత్ సేన అన్ని మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్ చేరడం ఖాయం. ఎందుకంటే.. ఈ రెండేండ్లలో భారత జట్టు ఆట ఎంతో మెరుగుపడింది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డపై హర్మన్‌ప్రీత్ సేన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను చిత్తుగా ఓడించింది. అదే ఉత్సాహంలో దక్షిణాఫ్రికాను కూడా చిత్తు చేసింది.
ఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ షపాలీ వర్మ (Shafali Varma), స్మృతి మంధాన (Smriti Mandhana)లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్లో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రీచా ఘోష్, పూజా వస్త్రాకర్‌లు సమర్ధంగా పోషిస్తున్నారు. పేసర్లు రేణుకా సింగ్, అరుంధతీ రెడ్డి.. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, ఆశా శోభనలు సైతం వికెట్ల వేటతో చెలరేగుతున్నారు.
షపాలీ వర్మ, స్మృతి మంధాన
అయితే.. వరల్డ్ కప్ ముందు కొండంత ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనుకున్న భారత జట్టుకు శ్రీలంక షాకిచ్చింది. ఆసియా కప్ (Asia Cup 2024)లో రికార్డు ట్రోఫీలు కొల్లగొట్టిన టీమిండియాకు చెక్ పెడుతూ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. లేదంటే.. వరుసగా 9వ టైటిల్‌తో భారత్ ఉత్సాహంగా వరల్డ్ కప్ యాత్రను మొదలెట్టేది.