Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలైనా అమ్మకాలతో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు దన్నుగా నిలువడంతో ప్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 84,257.17 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. కొద్దిసేపటికే నష్టాల్లోకి చేరుకున్నారు. సెన్సెక్స్ పడుతూ.. లేస్తూ చివరకు ప్లాట్‌గా ముగిసింది.
ఇంట్రాడేలో 84,648.40 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 84,098.94 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది. చివరకు 33.49 పాయింట్లు పతనమై.. 84,266.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. సెక్టార్లలో, మీడియా, ఆటో, ఐటిల్లో కొనుగోళ్లు కనిపించాయి. టెలికాం, పవర్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్, రియల్టీ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.