Taipei Open : తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువషట్లర్లు అదరగొట్టారు. ఆయుష్ శెట్టి (Ayush Shetty), ఉన్నాతి హుడా (Unnati Hooda)లు తమ తమ విభాగాల్లో అద్భుత విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. తద్వారా పతకానికి అడుగు దూరంలో నిలిచారిద్దరు. 20 ఏళ్ల ఆయుష్ సంచలన ఆటతో సీనియర్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth)కు చెక్ పెట్టడం గమనార్హం. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హుంగ్ యీ టింగ్ కడదాకా పోరాడినా ఉన్నాతి ధాటికి చేతులెత్తేసింది.
తొలి రౌండ్ నుంచి దూకుడుగా ఆడుతున్న ఉన్నాతి క్వార్టర్స్‌లోనూ చెలరేగింది. స్థానిక క్రీడాకారిణి అయిన హుంగ్కు ముచ్చెమటలు పట్టించింది. 52 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో భారత షట్లర్ 21-8, 19-21, 21-19తో జయభేరి మోగించింది. తదుపరి రౌండ్లో ఈ 17 ఏళ్ల సంచలనం జపాన్‌కు చెందిన తొమొకా మియజకీని ఢీ కొట్టనుంది.
Just in: 17 yrs old Unnati Hooda storms into SEMIS of Taipei Open (Super 300).
She beats home-favorite Hung Yi-Ting 21-8, 19-21, 21-19. #TaipeiOpen2025 pic.twitter.com/VOUc39GcKE
— India_AllSports (@India_AllSports) May 9, 2025
పురుషుల సింగిల్స్‌లో 20 ఏళ్ల ఆయుశ్ అద్భుతమై చేశాడనాలి. అతడు ఏకంగా భారత సీనియర్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను ఇంటికి పంపాడు. తొలి సెట్ నుంచే శ్రీకాంత్‌పై ఆధిపత్యం చెలాయించిన ఆయుష్.. 21-16, 15-21, 21-17తో మ్యాచ్ గెలుచుకున్నాడు. సెమీస్‌లో ఈ యంగ్‌స్టర్‌కు కఠిన సవాల్ ఎదురుకానుంది. చౌ థియెన్ చెన్(చైనీస్ తైపీ), మోహ్ జకీ ఉబైదిల్లాహ్(ఇండోనేషియా) మ్యాచ్ విజేతతో అతడు తలపడనున్నాడు.