Singareni pensions | గోదావరిఖని :సింగరేణి లో పని చేసి దిగి పోయిన కార్మికులు లైఫ్ సర్టిఫికెట్ లు ఇవ్వక పోవడం వల్ల 1818 మంది పింఛన్ దారులకు సింగరేణి పింఛన్ ఆగిపోయింది. ఈ అంశం కు సంబంధించి సీఎంపీఎఫ్ అధికారులు సంబంధించిన పింఛన్ దారులకు లైఫ్ సర్టిఫికెట్ లు పొందే విధంగా తగు ప్రకటన చేసి పెన్షన్ ను తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అళవందార్ వేణు మాధవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పని చేసి దిగిపోయిన ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ గత సంవత్సరం మార్చి 8 వ తేదీ నుంచి కనీస పెన్షన్ రూ.1000 చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం-2005 అనుసరించి గోదావరి ఖని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ రీజినల్ కమిషనర్, కొత్త గూడెం రీజినల్ కమిషనర్ లకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు.
అందుకు కొత్తగూడెం సీఎంపిఎఫ్ ప్రజా సమాచార అధికారి పంపిన లేఖలో కొత్తగూడెం సీఎంపిఎఫ్ రీజియన్ పరిధిలో 2134 మందికి కనీస పెన్షన్ రూ.1000 చెల్లిస్తున్నారని, కొత్తగూడెం సీఎంపిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుండి 18,111 మంది కోల్ పెన్షన్ పొందుతున్నారని, ప్రతీ నెల పెన్షన్ దారులకు రూ.20కోట్ల6లక్షల15వేల726 చెల్లిస్తున్నారని, 1818 మంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించక పోవడంతో వారి పెన్షన్ నిలిచిపోయిందని వారిచ్చిన సమాచారం లో పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ సమాచారం ఇచ్చిన కోల్ మైన్స్ ప్రావిడెంట్ కొత్తగూడెం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ లు సమర్పించని 1818 మంది పెన్షన్ దారులు ఆన్ లైన్ లో జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సి.ఎం.పి.ఎఫ్ అధికారుల కు సమర్పించి పెన్షన్ పొందాలని ఆయన తెలిపారు.