– దేశ్ ముఖి గ్రామంలో ప్రారంభించిన గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ గీతా నాయక్
భూదాన్ పోచంపల్లి, మార్చి 11 : మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ గీతా నాయక్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా సైనిక శిక్షణ డిగ్రీ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ గీతా నాయక్, జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్, టి ఎస్ ఆర్ శర్మ, డిప్యూటీ సెక్రటరీలు డి.శ్రీనివాస్, రజని రుతుమని, స్టేట్ ఆఫీసర్ నిర్మల, మల్టీ జోన్ ఆఫీసర్ అరుణకుమారి, జోనల్ ఆఫీసర్స్ లక్ష్మాంజలి, విద్యా రాణి తదితరులకు విద్యార్థినులు గౌరవ వందనాలు, కవాతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన 30 డిగ్రీ కళాశాల నుండి ప్రతి కళాశాల నుండి 50 మంది విద్యార్థులు నిర్వహించిన కాంటిజెంట్ మార్చింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.

గురుకుల డిగ్రీ కళాశాలల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఈ సందర్భంగా గీతా నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుదని, అందులో భాగంగా క్రీడాశాలల ఏర్పాటుకు ముందుకు వస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుని విద్యార్థులు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. క్రీడలతో ఒత్తిడిని జయించవచ్చని, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు విద్యా వైజ్ఞానిక రంగాల్లో వారు చేసిన ప్రయోగాలను తమ స్టాల్స్ లో ప్రదర్శించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ్ ముఖి కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, 30 సాంఘిక సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పీడీలు, దేశ్ ముఖి గ్రామ సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, ఉప సర్పంచ్ నూకల అశోక్, వార్డు మెంబర్ లింగం, గిడుగు రాములు, జక్కల శంకర్, పొంగరాజు యాదవ్ పాల్గొన్నారు.

గురుకుల డిగ్రీ కళాశాలల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం