అర్వపల్లి, మార్చి 11 : ప్రతి విద్యార్థి కష్టపడి చదువుల్లో మంచి ఫలితాలు సాధించాలని అర్వపల్లి ఎస్ఐ సైదులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థులు భావి భారత పౌరులని, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని, వేధింపులపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చన్నారు. డయల్ 100 కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారని తెలిపారు. సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలని, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీదేవి, పీఈటీ మల్లేశం, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.