ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ( MP KR Suresh Reddy) వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల ( Defections ) కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్( Danam Nagendhar) , కడియం శ్రీహరి( Srihari ) కి స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తి ని అపహాస్యం చేసినట్టేనని పేర్కొన్నారు.
రాజ్యాంగంలో మార్పులు కావాలని కాంగ్రెస్ కేంద్ర నాయకులు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా, తెలంగాణలో దీనికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఒక పార్టీ నుంచి గెలిచి, మళ్లీ ఇంకో పార్టీ నుంచి పోటీ చేసిన విషయం స్పష్టంగా రుజువులున్నా కూడా స్పీకర్ ఇచ్చిన తీర్పు నవ్వుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. కేసీఆర్ తమకు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నామని, పార్టీ ఫిరాయింపులపై కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. స్పీకర్ తీర్పుపై అన్ని అవకాశాలను ఉపయోగించి, జ్యుడిషియల్ రివ్యూకు వెళ్తామని స్పష్టం చేశారు.