T Natarajan : చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, స్నేహితులను ఎవరూ మర్చిపోలేరు. అలాంటిది తాను విద్యాబుద్దులు నేర్చిన బడికి ముఖ్య అతిథిగా వెళ్లడం అంటే అదొక గొప్ప గౌరవం. తాజాగా భారత క్రికెటర్ టి.నటరాజన్(T Natarajan) సైతం ఇదే గౌరవం పొందాడు. పసితనంలో తాను చదివిన బడికి ఈ పేసర్ ‘చీఫ్ గెస్ట్’గా వెళ్లాడు. తన బాల్యపు గుర్తులను యాది చేసుకున్న అతడు అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి.. ఓ పెద్ద సెల్పీ దిగాడు. ఆ ఫొటోను నటరాజన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది క్షణాల్లో ఆ పిక్ వైరల్ అయింది.
తమిళనాడుకు చెందిన నటరాజన్ చిన్నప్పమ్పట్టి(Chinnappampatti)లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చాలా రోజుల తర్వాత అతడు స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు ఆ స్కూల్‌కు అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తాను చదువుకున్న రోజుల్ని నటరాజన్ గుర్తు చేసుకున్నాడు.
‘ఎక్కడ అంతా మొదలైందో అక్కడికి వెళ్లడం చాలా గౌరవంగా అనిపిస్తోంది. నన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిచిన చిన్నప్పమ్పట్టి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్‌కు ధన్యవాదాలు. సొంతూరుకు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది’ అని 33 ఏండ్ల నటరాజన్ తన సెల్ఫీ ఫొటోకు క్యాష్షన్ రాశాడు.
విరాట్ కోహ్లీతో నటరాజన్
లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన నటరాజన్ ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చాడు. నట్టూగా పేరొందిన ఈ స్పీడ్‌స్టర్ 2021లో టీ20లకు ఎంపికయ్యాడు. ఒక టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20లు.. కలిపి మ్యాచ్‌లు ఆడాడంతే. ఆ తర్వాత ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్( sunrisers hyderabad) ప్రధాన పేసర్‌గా నటరాజన్ కొనసాగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ 17వ సీజన్లో ఫైనల్ చేరడంలో నట్టూ పాత్ర మరువలేనిది. నిరుడు నటరాజన్ 14 మ్యాచుల్లో 19 వికెట్లతో చెలరేగాడు.