అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు మారుతున్న వైసీపీ నాయకులపై మాజీ మంత్రి (Former minister ) కాకాణి గోవర్దన్‌రెడ్డి (Goverdan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు(Chandra Babu), టీడీపీ(TDP) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోదీదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఎంపీ, పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రస్తుతం ఏపీలో కూటమికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది ఎంపీలు ఉండగా వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం పరిపాటేనని ఆరోపించారు. 2014-19 టీడీపీ హయాంలో వైసీపీకి చెందిన 23 శాసనసభ్యులను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి పార్టీలో చేర్పించుకున్నారని విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 23 మంది మాత్రమే గెలుపొందారిని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో గెలిచిన వైసీపీ నాయకుల చేత రాజీనామా చేయించి వారిని కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబును విమర్శించారు. రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాల్లో టీడీపీ నాయకులను పోటీలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని, వాటి నుంచి దృష్టిని మరల్చేందుకు వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.