INDW vs SAW : పొట్టి సిరీస్ సమం చేయాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆదివారం చెపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తర్వాత మొదలైన వాన తెరిపినివ్వలేదు. దాంతో, అంపైర్లు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్ రద్దు చేశారు. వరుణుడి షాక్‌తో అటు సఫారీలు సైతం నిరాశకు గురయ్యారు.
తొలి టీ20లో గెలుపొందిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో చెలరేగిన తంజిమ్ బ్రిట్స్(52) మళ్లీ మెరిసింది. ఆఖర్లో అన్నెకె బొస్చ్(40), అన్నెరీ డెర్కెన్సన్(12) లు ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 170 దాటించారు. ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిల ఫీల్డింగ్ కూడా సఫారీలకు కలిసొచ్చింది. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు రావడంతో దక్షిణాఫ్రికా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.