WTC 2024-25 : వరుసగా రెండు పర్యాయాలు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో రన్నరప్. స్వదేశంలో వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం. 12 ఏండ్లుగా సొంతగడ్డపై కొనసాగిన ఆధిపత్యం. ఇంకేముంది మూడోసారి కూడా టెస్టు గద పోరులో అందరికంటే ముందున్న భారత జట్టు . ఫైనల్ వెళ్లడం పక్కా అనుకున్నారాంతా. కానీ, ఇప్పుడు సమీకరణాలు మారాయి. న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు భారీ ఓటములు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ ఆశలకు గండికొట్టేలా ఉన్నాయి. ఓ వైపేమో ఊరిస్తున్న టెస్టు గద (Test Mace). మరోవైపు చూస్తే రెండు పరాజయాలు. ఈ పరిస్థితుల్లో ఇంకా రోహిత్ శర్మ బృందం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశం ఉందా? అంటే.. ఉందంటున్నారు క్రీడా నిపుణులు. అందుకు ఏం చేయాలో కూడా చెబుతున్నారు.
ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను మట్టికరిపించిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్ పర్యటన, దక్షిణాఫ్రికాపై సిరీస్ సమం.. అనంతరం బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన అగ్రస్థానం పదిలం చేసుకుంది. ఇక మిగిలిన 8 మ్యాచుల్లో ఐదు గెలిచినా ఫైనల్ ఆడడం పక్కా అని అభిమానులు ధీమాతో ఉన్నారు. కానీ, భారత్‌కు ఊహించిన షాకిస్తూ న్యూజిలాండ్ రెండు టెస్టుల్లో గెలిచేసింది.
Moments in Pune! 📸#INDvNZ #CricketNation pic.twitter.com/glKvto4h22
— BLACKCAPS (@BLACKCAPS) October 26, 2024
అది కూడా భారీ విజయాలతో డబ్ల్యూటీసీలో నాలుగో స్థానంలోకి దూసుకొచ్చింది. ఇప్పుడు టీమిండియా మొదటి స్థానంలోనే ఉన్నా ఫైనల్ చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. అంటే.. కివీస్‌తో ఆఖరి టెస్టులో.. ఆపై ఆస్ట్రేలయాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియా జయకేతనం ఎగురవేయాల్సిందే. అప్పుడే మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి టెస్టు గదను ముద్దాడాలనుకుంటున్న భారత క్రికెటర్ల కల సాకారం కానుంది.
పుణే టెస్టులో ఓటమి టీమిండియాకు కోలుకోలేని దెబ్బ. డబ్ల్యూటీసి ఫైనల్ అవకాశాల్ని సంక్లిష్టంగా మారడమే అందుకు కారణం. బెంగళూరు టెస్టులో పరాజయం నుంచి తేరుకొని పుణేలో పంజా విసరాలనుకున్న భారత్‌కు స్పిన్ అస్త్రంతోనే న్యూజిలాండ్ చెక్ పెట్టింది. స్వదేశంలో 12 ఏండ్లుగా సాగుతున్న ఆధిపత్యాన్ని ముగిస్తూ మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు టీమిండియా ముందున్న దారి ఏంటంటే.. వాంఖడే టెస్టులో కచ్చితంగా కివీస్‌ను ఓడించాలి.
India’s qualification scenario for the WTC Final without depending on other teams 🏏🇮🇳 pic.twitter.com/c0YLUNk3CU
— CricketGully (@thecricketgully) October 26, 2024
అదొక్కటే సరిపోదు.. నవంబర్‌లో మొదలయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కంగారూలను కంగారెత్తించాలి. 2018-19, 2021-22లో ఆసీస్‌ను చిత్తు చేసి ట్రోఫీ పట్టేసిన భారత్ ఇప్పుడు అదే తరహాలో ఆడితేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే వీలుంది. అయితే.. సొంతగడ్డపై వరుసగా రెండు పర్యాయాలు ట్రోఫీని కోల్పోయిన ఆసీస్ ఇప్పుడు కసితో ఉంది. ఈసారి ఎలాగైనా సిరీస్ కైవసం చేసుకొని డిఫెండింగ్ చాంపియన్‌గా టెస్టు గద పోరుకు మళ్లీ సిద్ధం కావాలని కమిన్స్ బృందం భావిస్తోంది. అందుకని తొలి టెస్టుకు పెర్త్‌ను వేదికగా మార్చింది.
India’s lead at the top of the WTC table has been reduced to a thin margin after two straight losses #INDvNZ #PAKvENG pic.twitter.com/IYftv0JCXB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
గత పర్యటనలో అక్కడ 36 పరుగులకే ఆలౌట్ అయి.. అనూహ్యంగా పంత్ మెరుపులతో పుంజుకొని భారత జట్టు సిరీస్ సాధించింది. ఇప్పుడు కూడా అదే జరగాలంటే.. ఈ నేపథ్యంలో రోహిత్ సేన స్థాయికి తగ్గట్టు ఆడితేనే ఫైనల్ చేరుతుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లు భారీ స్కోర్లు చేయాలి. బౌలింగ్‌లో బుమ్రా, ఆకాశ్ దీప్.. స్పిన్ ద్యయం అశ్విన్, జడేజాలు తిప్పేయాలి.