Cryptocurrency-RBI | క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక సుస్థిరత, ద్రవ్య సుస్థిరతకు భారీ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థలోకి మనీ చలామణిపై ఆర్బీఐ నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో శక్తికాంత దాస్ మాట్లాడారు.
‘ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శించే క్రిప్టో కరెన్సీలను అనుమతించవద్దని నా అభిప్రాయం. క్రిప్టో కరెన్సీలతో భారీ ఆర్థిక సుస్థిరత ముప్పు, భారీ ద్రవ్య లభ్యత ముప్పు పొంచి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ముప్పులో పడుతుంది. అంతే కాదు ఎకానమీలో మనీ చలామణిపై ఆర్బీఐ నియంత్రణ కోల్పోతుంది’ అని శక్తికాంత దాస్ అన్నారు.
‘ఆర్థిక వ్యవస్థలోకి మనీ చలామణిపై నియంత్రణ కోల్పోతే, బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను ఆర్బీఐ ఎలా చెక్ చేస్తుంది. సంక్షోభ సమయాల్లో మనీ సరఫరాపై నియంత్రణ కోల్పోతే ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది. కనుక క్రిప్టో కరెన్సీలు ముప్పు. దేశాల సరిహద్దులు దాటి క్రిప్టో కరెన్సీల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ అవగాహన అవసరం’ అని శక్తికాంత దాస్ ప్రశ్నించారు.