కరీంనగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశవ్యాప్తంగా దుమారం రేపిన నైని బొగ్గు గని టెండర్ల అక్రమాలను నిగ్గు తేల్చడంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం చూపుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నైని టెండర్లలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆగమేఘాల మీద సాంకేతిక కమిటీ వేయడంతోపాటు విచారణ జరిపి మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్రం ఆ తర్వాత జోరు చూపడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరిపి 30 రోజులు దాటినా నేటికీ నివేదికను బహిర్గతం చేయకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నైని టెండర్ల వ్యవహారంలో వెలుగు చూసిన అంశాలపై కమిటీ ఇచ్చిన నివేదిక కాపీ ఇవ్వాలంటూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సమాచార చట్టం కింద కేంద్రాన్ని అడిగితే ఇంకా విచారణలో ఉన్నదని, ఇప్పుడే నివేదిక కాపీ ఇవ్వడం సాధ్యపడదని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిన తీరుపై సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పెట్టి, తన అస్మదీయులకు దక్కేలా చేసిన ప్రయత్నాలను ముందుగా బీఆర్ఎస్ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడంతో చివరికి టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడం, ఆ వెంటనే సింగరేణి టెండర్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే టెండర్లో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులెవరో గుర్తించి, మరోసారి సింగరేణిలో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సింగరేణి వ్యాప్తంగా వినిపించింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సింగరేణిలోని దాదాపు అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ మేరకు నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి స్పందించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీపరాజ్ నయన్ జనవరి 22న ఇద్దరు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్ల్లా, డైరెక్టర్ మారవల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. టెండర్ నోటీసును విశ్లేషించి, టెండర్ రద్దుకు కారణాలేంటి? బొగ్గు ఉత్పత్తి కోసం ఇతర కోల్ కంపెనీలు అనుసరించే పద్ధతులేంటి? సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీని ద్వారా లబ్ధి పొందడానికి ఎలాంటి అవకాశాలుంటాయి? సింగరేణి విధించిన టెండర్ నిబంధనకు ఇతర కంపెనీలు అనుసరిస్తున్న నిబంధనలకు తేడాలు ఏమున్నాయి? కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఏవిధంగా వెచ్చిస్తున్నారు? ఏయే నిబంధనలు అనుసరిస్తున్నారు? అనే అంశాలపై సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, మూడు రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశించింది.
నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో సాంకేతిక కమిటీ వేసినప్పుడు కేంద్రం చేసిన హడావుడి చూసి, ఇక అక్రమార్కుల భరతం పడుతారన్న చర్చ జరిగింది. ఆగమేఘాలపై సాంకేతిక కమిటీ వేయడం ఒకెత్తయితే సదరు కమిటీ మూడు రోజుల్లోనే నివేదిక సమర్పించాలని నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేసిన తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో వేగం తగ్గిపోయింది. సాంకేతిక కమిటీ తన నివేదికను మూడు రోజుల్లోనే ఇచ్చిందన్న వార్తలు వచ్చినా నేటికీ ఆ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని కేంద్రం బహిర్గతం చేయలేదు. నైని బొగ్గు గని టెండర్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన జారీ చేయలేదు. దీంతో అసలు కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటీ? మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటూ గడువు పెట్టిన కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ, ఆ నివేదికను బహిర్గతం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నదన్న దానిపై సింగరేణి వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
నైని బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటి? ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? మొత్తంగా నైని బ్లాక్ టెండర్ రద్దు, సీఎస్ఆర్ నిధుల దుర్వినియోగంపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికతోపాటు నోట్ ఫైళ్లను బహిర్గతం చేయాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను సమాచార హక్కు చట్టం కింద ఫిబ్రవరి 2న అడిగారు. ఈ విషయంపై మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 26న ఒక సమాచారం ఇస్తూ.. కమిటీ సమర్పించిన నివేదిక ఇంకా పరిశీలనలో ఉన్నదని, ఈ విషయంలో తుది నిర్ణయాలు జారీ కాలేదని, నివేదిక బయటకు ఇస్తే పక్రియకు ఆంటకం కలిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. హడావుడిగా కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చి.. సదరు సమాచారాన్ని తీసుకున్న కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, అందులోని నిజనిజాలు నిగ్గు తేల్చడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సింగరేణి చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణానికి తెరలేపి, రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా లూటీ చేసున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. నైని టెండర్లపై సాంకేతిక కమిటీ నివేదికను బహిర్గతం చేయకపోవడం, ఆర్టీఐ కింద పెట్టిన దరఖాస్తుకు సరైన సమాధానం ఇవ్వక పోవడాన్ని పరిశీలిస్తే దీని వెనుక చీకటి ఒప్పందాలున్నట్టు అర్థమవుతున్నదని చెప్పారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ విలువ వేల కోట్లలో ఉంటుందని, అంతటి భారీ టెండర్‌ను అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకే వ్యూహాత్మకంగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టెండర్ నిబంధనలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే క్లాజ్ పెట్టడం పక్కాగా ప్లాన్ చేసిన మహా కుట్ర అని తెలిపారు. ఆర్టీఐలోని ఏ మినహాయింపు సెక్షన్ కింద సమాచారాన్ని ఆపుతున్నారో కూడా చెప్పకుండా తన దరఖాస్తును తిరస్కరిచడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పారదర్శకత గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వం, సింగరేణి విషయంలో ఎందుకు ఇంత రహస్యంగా వ్యవహరిస్తున్నదని ప్రశ్నించారు. నిజాలు బయటకు వస్తే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పెద్దల ముసుగులు తొలగిపోతాయనే భయంతోనే ఈ సమాచారాన్ని తొక్కిపెడుతున్నట్టు భావించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. విచారణ కమిటీ కేవలం ‘డైవర్షన్ టాక్టిక్”అని మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామని, సింగరేణిలో అవినీతిపై కార్మికులు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కమిటీ నాటకానికి కేంద్రం తెరలేపిందని విమర్శించారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ చివరికి తప్పు చేసిన వారికి క్లీన్ చిట్ ఇవ్వడమే ఈ కమిటీ అసలు లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆరోపించారు. భారీ కుంభకోణంపై పూర్తిస్థాయి నివేదికలు బయటకు వచ్చే వరకు, బాధ్యులను బోనులో నిలబెట్టే వరకు టీబీజీకేఎస్ విశ్రమించబోదని తేల్చిచెప్పారు.