WTC 2023-25 : స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ విజయానందం ఆవిరైంది. 12 ఏండ్లుగా ట్రోఫీని వదలని టీమిండియా (Team India) తొలిసారి ఘోర పరాభవం మూటగట్టుకుంది. టన్నుల కొద్దీ పరుగులు.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన యోధులంతా ఆడలేక చేతులెత్తేశారు. ఫలితంగా… స్పిన్ పిచ్‌లతో ప్రత్యర్థులను దెబ్బకొట్టే భారత జట్టు ఇప్పుడు అదే అస్త్రానికి తలొంచింది. రోహిత్ శర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవడం అభిమానులకు మింగుడుపడడం లేదు. ముంబైలో 25 పరుగుల ఓటమితో వైట్‌వాష్‌కు గురైన టీమిండియాకు మరో షాక్. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేజారింది.
బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొందిన టీమిండియా నెల రోజుల్లోనే తేలిపోయింది. శ్రీలంక చేతిలో చావుదెబ్బ తినొచ్చిన న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి సిరీస్ సర్పించుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమితో వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలనుకున్న భారత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో టీమిండియా 58.33 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
India lose their top spot in the #WTC25 standings to Australia ahead of the Border-Gavaskar series 👀
More ➡ https://t.co/NhIdk0D9Bc#INDvNZ pic.twitter.com/QOal6bA5tD
— ICC (@ICC) November 3, 2024
శ్రీలంక 55.56 పాయింట్లతో మూడో, న్యూజిలాండ్ 54.55 పాయింట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ సేన టెస్టు గద పోరుకు అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియా పర్యటనలో 5-0తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలి. అయినా సరే.. ఫైనల్ చాన్స్ కోసం శ్రీలంక, కివీస్, దక్షిణాఫ్రికా ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాకాకుండా ఆసీస్ ఈసారి ట్రోఫీ అందుకుంటే.. టీమిండియా ఆశలు ఆవిరైనట్టే.
సొంతగడ్డపై 12 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా మళ్లీ అదే తడబాటు కనబరిచింది. బెంగళూరు, పునే, ముంబై.. వేదిక మారినా ఫలితం మారలేదు. ఇప్పటికే రెండు ఓటములతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు ముంబైలోనూ స్పిన్ అస్త్రానికి కుప్పకూలింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ టాపార్డర్ విఫలమైనా రిషభ్ పంత్(64) విధ్వసంక హాఫ్ సెంచరీతో ఆశలు రేపినా.. అజాజ్ పటేల్(6/57) తిప్పేశాడు.
New Zealand wrap up a remarkable Test series with a 3-0 whitewash over India following a thrilling win in Mumbai 👏 #WTC25 | 📝 #INDvNZ: https://t.co/XMfjP9Wm9s pic.twitter.com/vV9OwFnObv
— ICC (@ICC) November 3, 2024
లంచ్ తర్వాత కాసేపటికే పంత్‌ను వెనక్కి పంపిన అతడు.. వాషింగ్టన్ సుందర్(12)ను బౌల్డ్ చేసి కివీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 25 పరుగుల తేడాతో ఓడి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ టాపార్డర్‌లో ఒక్కరు పంత్‌కు తోడుగా నిలబడినా ముంబైలో విజయం మనదే అయ్యేది. కానీ, సంచలనాలకు నెలవైన క్రికెట్లో అత్యుత్తమ ఆట ఆడిన జట్టే గెలుస్తుందని న్యూజిలాండ్ మరోసారి చాటింది.