జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 25 : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్న ఎమ్మెల్యే ఎక్కడికి పోయిండు? అని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎర్రగుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసముంటున్న అర్హులైన వారందరికీ ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలు బుధవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ‘ఇండ్లు లేని పేదోళ్లం సార్.. రెండు ఏండ్లుగా కరెంటు, నీళ్లు లేకున్నా.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నాం’ అని వారు ఆవేదన చెందారు.
ఇప్పుడేమో అధికారులు తమకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గెలిచిన వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎక్కడికి పోయాడని మండిపడ్డారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారనే ఆశతో ఓట్లు వేశామని చెప్పారు. ‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేసీఆర్ కట్టించిండు.. ఎన్నికలు వచ్చినందుకు మాకు ఇండ్లు ఇవ్వలేదు.. ఇండ్లు లేవు కాబట్టి ఓపిక నశించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్నాం.. ఇప్పుడు ఏ నాయకుడు మా గోడును పట్టించుకుంటలేరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. మహిళల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.