Lionel Messi : రెండేండ్లలో ఫుట్‌బాల్ పెద్ద పండుగ రాబోతోంది. ఇప్పటికే క్వాలిఫయర్ మ్యాచ్‌లు పూర్తికావడంతో అన్ని జట్లు ఫిఫా వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో అర్జెంటీనా (Argentina) డిఫెండింగ్ చాంపియన్‌గా ఆడనుంది. అయితే.. ఆ జట్టుకు 2022లో ట్రోఫీ అందించిన కెప్టెన్ లియోనల్ మెస్సీ (Lionel Messi) వరల్డ్ కప్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇదే విషయంపై మెస్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మా జట్టు వరల్డ్ కప్ కోసం సిద్దమవుతోంది. అయితే.. అందుకు చాలా సమయం ఉంది. ఫుట్‌బాల్‌లో అప్పటివరకూ ఏదైనా జరగొచ్చు. అందుకని నేను ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రతిరోజు ఆటను ఆస్వాదించడంపైనే నా దృష్టంతా ఉంది’ అని మెస్సీ వరల్డ్ కప్ ఆడడంపై స్పందించాడు. ప్రస్తుతం మెస్సీకి 37 ఏండ్లు. మరో రెండేండ్లలో 39కి చేరుకుంటాడు. అయితే.. ఫిట్నెస్ రీత్యా మునపటిలా మైదానంలో చురుకుగా కదలడం కష్టమే. ఈ విషయం తెలిసిన మెస్సీ వరల్డ్ కప్ ఆడడంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు.
ఈమధ్య మెస్సీ గురించిన కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత అతడు కోచ్ అవతారం ఎత్తడం పక్కా అంటున్నారు కొందరు. అయితే.. మెస్సీ మాత్రం అందరిలా తాను కోచ్ అవ్వను అంటూ పెద్ద షాకిచ్చాడు. ‘రిటైర్మెంట్ తర్వాత కోచ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వీడ్కోలు పలికాక ఏం చేయాలనే విషయం గురించి నాకు ఇప్పటికైతే ఐడియా లేదు. అయితే.. భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. రోజువారీ జీవితాన్ని ఆస్వాదిస్తాను. అందుకని ఫుట్‌బాల్ ఆడడం, సాధన చేయడం, జట్టు సభ్యులతో నవ్వుతూ ఉండడం.. ప్రస్తుతానికి ఇవే నా ప్రాధమ్యాలు’ అని మెస్సీ వెల్లడించాడు.
నిరుడు సంచలన ప్రదర్శన చేసిన మెస్సీ పలు అవార్డులు కొల్లగొట్టాడు. ‘బెస్ట్ ఫిఫా మెన్స్ ఫుట్‌బాలర్’ అవార్డుతో పాటు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ‘బాలెన్ డిఓర్’ అవార్డును గెలుచుకున్నాడు. ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ అదరగొట్టాడు. లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్(France)ను ఓడించింది. తన మార్క్ కెప్టెన్సీతో రెండోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ క్షణంతో 35 ఏండ్ల మెస్సీ వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది. మెగా టోర్నీ అనంతరం మెస్సీ పారిస్ సెయింట్ జర్మనీని వీడి మియామి క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.