తిరుమల : దీపావళి, వారంతపు సెలువుల కారణంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం (Shilatoranam) వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 88,076 మంది భక్తులు దర్శించుకోగా 36,829 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.52 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
5న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
ఈనెల 5న నాగుల చవితి సందర్భంగా మలయప్పస్వామి (Malayappa Swamy) పెద్దశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు.