అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి పెళ్లిఘట్టానికి అభిమానుల సూచనతో ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఈ జంట పెళ్లికి వేదిక కానుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు భారత ప్రధాని మోదీ కార్యాలయం నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి.
విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందనగా ప్రధాని మోదీ ఈ లేఖను పంపించారు. ‘ఈ వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. విజయ్-రష్మిక తమ జీవితంలో అందమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సప్తపది స్ఫూర్తితో ఏడడుగులు వేస్తున్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసి ప్రయాణం చేయాలని ఆకాంక్షిస్తున్నా. విజయ్ -రష్మిక మందన్నకు సినిమా స్క్రిప్ట్‌లు కొత్తకాదు. కానీ ఈ పెళ్లి మాత్రం వారి నిజ జీవితాల్లో దైవం రాసిన స్క్రిప్ట్. ఈ వివాహ బంధం ప్రేమ, ఆప్యాయతలతో పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రధాన మంత్రి మోదీ తన లేఖ ద్వారా శుభాకాంక్షలు అందించారు.