BCCI : ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పురుషుల జట్టు వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో కీలక సిరీస్‌లు ఆడనుంది. జవనరిలో న్యూజిలాండ్ (Newzealand) జట్టు భారత పర్యటనకు రానుంది. ఎనిమిది మ్యాచ్‌ల సిరీస్ కోసం కివీస్ రానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేదికలను ఖరారు చేసింది. శుక్రవారం చూచాయగా 8 స్టేడియాలను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇందులో ఉప్పల్ స్టేడియం కూడా ఉండడం హైదరాబాద్‌లోని అభిమానులకు తీపికబురులాంటిదే.
న్యూజిలాండ్‌తో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అన్నీ వైట్‌బాల్ మ్యాచ్‌లే కావడంతో ముందస్తుగానే వేదికలను ఖరారు చేసింది భారత బోర్డు. హైదరాబాద్ జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, గువాహటి, త్రివేండ్రం, నాగ్‌పూర్ వేదికగా మ్యాచ్‌లు జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. జూన్ 14 శనివారం జరుగబోయే బీసీసీఐ సమావేశంలో వేదికలు, మ్యాచ్ తేదీలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
🚨 NEWS 🚨
BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.
Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA
— BCCI (@BCCI) June 9, 2025
కివీస్‌తో సిరీస్ అనంతరం అక్టోబర్‌లో వెస్టిండీస్, టీమిండియాల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఆ వెంటనే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్ ఉంటుంది. ఈమధ్యే విండీస్, సఫారీ సిరీస్ వేదికలను మార్చిన విషయం తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పిచ్, ఔట్ ఫీల్డ్ మరమ్మతుల నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టులను అహ్మదాబాద్, ఢిల్లీలో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులకు ఈడెన్ గార్డెన్స్, గువాహటి వేదిక కానుండగా.. మూడు వన్డేలను రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్‌లో నిర్వహించనున్నారు.