WTC Final : అహ్మదాబాద్ విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే చెట్టును ఢీకొని.. సమీపంలోని వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కూలింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై పలు దేశాల నాయకులు సంతాపం తెలియజేశారు. లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం సంతాపం తెలిపి.. నల్ల రిబ్బన్లు ధరించారు.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం 241 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజు ఆసీస్, సఫారీ ఆటగాళ్లు మృతులకు సంతాపం తెలిపారు. తొలి సెషన్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు అందరూ నిల్చొని నిమిషం సేపు మౌనం పాటించారు.
ఆ తర్వాత భుజానికి నల్ల రిబ్బన్లు(Black Ribbons) కట్టుకొని మైదానంలోకి దిగారు దక్షిణాఫ్రికా ప్లేయర్లు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు సైతం మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న టీమిండియా శుక్రవారం ఇంట్రా స్క్వాడ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం లండన్‌కు బయల్దేరింది. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీషర్లు, 8 మంది పోర్చుగల్ దేశస్థులు సహా కెనడాకు చెందిన ఒకరు అయితే.. టేకాఫ్ అయిన 2-3 నిమిషాల్లోనే చెట్టును ఢీకొని సమీపంలోని వైద్య కళాశాల వసతి గృహం భవంతిమీద పడిపోయింది. అనంతరం భారీ పేలుడుతో విమానం తునాతునకలైంది. ఈ ఘటనలో వైద్య కళాశాలలోని 24 మంది మెడికోలు ప్రాణాలు విడిచారు.
Ramesh Viswashkumar, The sole survivor of the Air India crash escaped by jumping from the plane. He was on seat number 11A. #AirIndia #AhmedabadNews #Gujarat #PlaneCrash #ITReel pic.twitter.com/NsMBeZOkbX
— IndiaToday (@IndiaToday) June 12, 2025
యావత్ ప్రపంచాన్నిఉలిక్కిపడేలా చేసిన ఈ ప్రమాదంలో ఒకేఒక్కడు మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. శవాల దిబ్బగా మారిన ఘటనా స్థలం నుంచి రమేశ్ విశ్వకుమార్ (Ramesh Vishwa Kumar) అనే 38 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ అంబులెన్స్ వరకూ వెళ్లాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. ఊహించుకోవడానికే వణుకు పుట్టే ఈ ప్రమాదంలో రమేశ్ ప్రాణాలతో ఉండడం నిజంగా అద్భుతం.