Hyderabad Bonalu | మల్కాజిగిరి, జూన్ 13: ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం నాడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. ఆషాఢ మాస బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. ఆషాఢ మాస బోనాలు, క్రిస్మస్ పండుగ, రంజాన్ పండగలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతోపాటు ముస్లింలకు ఇఫ్తార్ విందుతోపాటు తోఫాలను అందజేశారని, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు భోజనాలు, గిఫ్ట్ లను అందజేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆషాఢ మాస బోనాలకు అన్ని దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి పండగను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.