Sanath Jayasuriya | శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య ఆటగాళ్లకు కీలక సూచన చేశారు. ఇటీవల టీ20 సిరీస్ ఓటమి, వన్డే మ్యాచ్ టైగా ముగిసిన నేపథ్యంలో ఆటగాళ్లు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. టీ20లలో లంక చాలాసార్లు మంచి స్థితిలో కనిపించినా.. వరుస వికెట్లు కోల్పోయి 0-3 ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ‘జట్టులో నిబద్ధత లేకపోవడం కనిపించలేదు. కానీ ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కోవాలి. మ్యాచ్ పరిస్థితులపై అవగాహన మెరుగుపరుచుకోవాలి’ అని సూచించారు. శ్రీలంక మైదానాలు పెద్దవిగా ఉన్నందున బ్యాట్స్మెన్లు సిక్స్‌లు కొట్టడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఫోర్లు, రెండుపరుగులు తీయవచ్చన్నారు. పవర్ హిట్టింగ్‌పై మాట్లాడుతూ.. శ్రీలంకలో అంత అవసరం లేదని తాను భావిస్తున్నానన్నారు.
ఫోర్లు, రెండు రన్లు తీసినా కావాల్సిన స్కోరును సాధించవచ్చని తెలిపారు. శ్రీలంక మైదానాలు కాస్త పెద్దవని.. ఫోర్లు కొట్టి రెండు మూడు పరుగులు తీయవచ్చని చెప్పాడు. అలా చేయగలిగితే సిక్సర్లు కొట్టకుండా కూడా పని పూర్తి చేయవచ్చని చెప్పాడు. టీ20 సిరీస్ తర్వాత పేలవ ప్రదర్శన తర్వాత ఆటగాళ్లు విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని జయసూర్య సూచించాడు. కోచ్‌గా, సపోర్టు స్టాఫ్‌గా, టీమ్‌గా విమర్శలను అంగీకరించాలన్నారు. తాను క్రికెటర్‌గా ఉన్న సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ప్రతి క్రికెటర్ దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విమర్శలు వచ్చినప్పుడు అంగీకరించాల్సిందేనన్నారు. టీ20 ఫార్మాట్లో మా అత్యుత్తమ ఆటగాళ్ళలో చరిత్ అసలంక ఒకరని.. కెప్టెన్సీతో కొంత ఒత్తిడి ఉంటుందని.. కుదురుకునేందుకు కాస్త సమయం ఇవ్వాలని మాజీ క్రికెటర్ సూచించారు.