‘అశ్విన్‌ను చూసి భయపడటం లేదు..’
‘స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి..’
‘మహేశ్ బౌలింగ్‌లో ముమ్మరంగా సాధన చేశాం..’
‘నాగ్‌పూర్‌లో తప్పక స్పిన్ ఉచ్చును ఛేదిస్తాం..’
బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలివి!
‘బాత్ బారాణా, కామ్ చారాణా’లాగా.. మ్యాచ్‌కు ముందు బీరాలు పలికిన కంగారూలు.. నాగ్‌పూర్‌లో భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్తో కూస్తో పోరాడిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా భారత జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. క్రీజులో కుదురుకోవాలని కనీసం ప్రయత్నించని ఆసీస్ బ్యాటర్లు.. పెవిలియన్‌కు వెళ్లేందుకు పోటీపడ్డారు!
నాగ్‌పూర్: స్వదేశంలో తమకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయించుకోవడం పరిపాటిగా మారిన ప్రస్తుత తరుణంలో.. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్‌కు ముందు టీమిండియా కూడా స్పిన్‌కు సహకరించే వికెట్ రూపొందించింది. ఈ విషయం ముందే గ్రహించిన ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్ కంటే స్పెషల్ ప్రాక్టీస్ అవసరమని.. టూర్ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ ప్రారంభించింది. తొలి టెస్టుకు పది రోజుల ముందే భారత గడ్డపై అడుగుపెట్టిన కంగరూలు బెంగళూరులో ప్రత్యేక ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కసరత్తులు చేసింది. ముఖ్యంగా భారత టాప్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ముప్పు పొంచి ఉంటుందని అనుమానించిన ఆస్ట్రేలియా అందుకు తగ్గట్లే సిద్ధమైంది. అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉంటే మహీశ్ పితియా బౌలింగ్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసి నాగ్‌పూర్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్‌కు ముందు రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘ఈ సారి భిన్నమైన ఆసీస్‌ను చూస్తారు. గతం తాలూకు ఛాయలను పక్కనపెట్టి ఈ సారి భారత్‌లో తప్పక రాణిస్తాం’ అని అన్నాడు. దీంతో నిజంగానే ఆస్ట్రేలియన్లు ఈ సిరీస్ కోసం భారీగానే సిద్ధమై వచ్చారని అంతా భావించారు. అయితే మూడు రోజుల్లోనే కంగారూల మాటలు ఒట్టి నీటి మూటలని తేలిపోయింది.
నాగ్‌పూర్ పిచ్‌పై నాలుగో టెస్టులో బ్యాటింగ్ చేయడం కష్టమని భావించిన కంగారూలు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. స్పిన్ కోసం సిద్ధమై వచ్చిన వారికి మన పేసర్లు భారీ షాక్ ఇచ్చారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, షమీ వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించారు. ఈ దశలో ప్రపంచ స్థాయి ఆటగాైళ్లెన స్మిత్, లబుషేన్ కాస్త పోరాడినా.. ఒక్కసారి జడేజా ప్రతాపం ప్రారంభమయ్యాక ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడను తలపించింది. జడ్డూకు అశ్విన్ తోడవడంతో ఆసీస్ పతనం వేగంగా సాగింది. అయినా కొద్దిలో కొద్ది తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మంచి స్కోరే చేయగలిగింది. అయితే జట్టు ఎంపికలోనే తప్పిదాలు చేసిన కంగారూలు.. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హేడ్ను పక్కనపెట్టడం ఆసీస్‌ను మరింత దెబ్బకొట్టింది. బౌలింగ్‌లో మిషెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది.
ఆసీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ చోట.. భారత్ అదరగొట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఖర్లో ధాటిగా ఆడిన షమీ ఈ పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో ఆసీస్‌కు చూపించాడు. ఇక భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సమర్పించుకున్న ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో కనీస ప్రతిఘటన కూడా చూపలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా రూపంలో కంగారూలకు కష్టం ఎదురుకాగా.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ తన విలువ చాటుకున్నాడు. గింగిరాలు తిరిగే బంతులతో ఆస్ట్రేలియన్లతో ఆటాడుకున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ కంగారూలను బెంబేలెత్తించాడు. అతడితో పాటు జడేజా, షమీ కూడా సత్తాచాటడంతో భారత్ భారీ విజయం ఖాతాలో వేసుకుంది. గాయం నుంచి కోలుకొని దాదాపు ఆర్నెళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.
WTC 2023 | డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో భారత్ స్థానం పదిలం.. ఆస్ట్రేలియాకు షాక్