Chiranjeevi | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్లో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ తన స్టైల్, యాక్షన్ సీన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ట్రైలర్‌లోని డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. “మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే. డియర్ కల్యాణ్ బాబు, హరీష్ శంకర్, మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్‌కు అభినందనలు” అంటూ చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ నుంచి వచ్చిన ప్రశంసలతో పవన్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ట్వీట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్పందించారు. “అయ్యబాబోయ్… అన్నయ్య!! మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఎంతగా నచ్చిందో అర్థమవుతోంది. మీరు విదేశాల్లో ఉన్నప్పటికీ మా ట్రైలర్ చూసి అభినందనలు చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. అలాగే “మెగా ఆశీర్వాదం కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్లడమే. ఎందుకంటే మీరు ట్వీట్ పెడితే హీట్ పెరిగినట్టే” అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఆయన స్పందన కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.