IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ నెలకొంది. ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ అభిమానులకు టీ20 మజాను ఇవ్వనుంది. దాంతో, స్టేడియానికి వెల్లిలో మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి చూపించేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల టికెట్లు దొరకడం గగనం అయిపోతోంది. అయితే.. ఇదే అదనుగా కొందరు బ్లాక్ మార్కెట్లో టికెట్లను అమ్మకానికి పెడుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
ధర్మశాల వేదికగా మే 4న పంజాబ్ కింగ్స్(Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్(LSG)లు తలపడనున్నాయి. కానీ, ఈ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో లభిస్తున్నాయంటూ సోషల్ మీడియలో పోస్ట్‌లు పెట్టారు కొందరు ప్రభుద్దులు. దాంతో, ఈ వ్యవహారంపై హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్పందించింది. హెచ్‌సీఏ డైరెక్టర్ సంజయ్ శర్మ(Sanjay Sharma) మాట్లాడుతూ.. ఐపీఎల్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారనే వార్తల్ని ఖండించాడు.
‘లక్నో, పంజాబ్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో లభిస్తున్నాయనేది అవాస్తవం. అలా జరిగేందుకు ఆస్కారమే లేదు. మేము పారదర్శకంగా టికెట్లు అమ్మాలని భావిస్తున్నాం. కాబట్టి అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు’ అని సంజయ్ వివరించాడు. దాంతో.. ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
హిమాలయ పర్వత సానువుల్లోని ధర్మశాల స్టడియంలో 2,200 మంది ప్రేక్షకులు పడతారు. అయితే.. 20 శాతం టికెట్లను పాస్‌ల రూపంలో స్థానిక రాజకీయ నాయకులు దక్కించుకుంటున్నారట. దాంతో, పర్యాటకులకు టికెట్లు దొరకడం లేదు. అందుకే కొందరు మరిన్ని టికెట్లు కేటాయించాలని ఐపీఎల్ నిర్వాహకులకు విన్నవించుకుంటున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. 6వ స్థానంలోని లక్నోను ఢీ కొంటుంది. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ ఈ పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.