హైదరాబాద్ మార్చి 3 (నమస్తే తెలంగాణ) : మైనార్టీ ఫైనాన్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు పంపిణీ చేసే యూనిట్లకు సంబంధించిన దరఖాస్తుల్లో 25 జిల్లాల వారికే అవకాశం దక్కింది. టీజీవోబీఎంఎంఎస్ (ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మాని టరింగ్ సిస్టం) పోర్టల్లో ఎనిమిది జిల్లాల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో సదరు జిల్లాల్లోని మైనార్టీ యువతకు యూనిట్లు లభించే అవకాశం లేకుండా పోయింది. మైనార్టీ సంక్షేమ శాఖ నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తప్పిదాన్ని సరిదిద్ది అన్ని జిల్లాల మైనార్టీ యువతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 2025-26 సంవత్సరానికి యువతకు 3,150 యూనిట్లు మంజూరు చేశారు. అయితే ఇందులో 25 జిల్లాలకు 2,970 యూనిట్లు కేటాయించారు. సంబంధిత శాఖ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కోటా కింద 180 యూనిట్లు పెట్టారు. ఒక్కో యూనిట్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్లు, తురకాశి వర్గాలకు ఇతర పరికరాల కోసం రూ. 1.50 లక్షల రుణం మంజూరు చేస్తారు. ఇందులో 80 శాతం సబ్సిడీ అంటే 1.20 లక్షలు సబ్సిడీ ఉంటుంది. కేవలం రూ. 30 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత నెలరోజుల్లో పరిశీలన ఇతర ప్రక్రియను పూర్తిచేసి నెలరోజుల్లోగా యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే మిగిలిన రాజన్నసిరిసిల్ల, నాగర్కర్నూల్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, సూర్యాపేట, ములుగు జిల్లాలను విస్మరించారు.
టీజీవోబీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్లో ఈ జిల్లాల పేర్లు కనిపించడం లేదు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన యువకులు అటూ మండల పరిషత్, ఇటూ మీ సేవ, ఆన్లైన్ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే దరఖాస్తు చేసే అవకాశంలేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. కేవలం ఆరు రోజులే గడువు ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మైనార్టీ శాఖ ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల యువతకు వర్తింపజేయడం, కొన్ని జిల్లాల వారిపై వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని మైనార్టీ సంక్షేమ సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే చేసిందా? లేదంటే సాంకేతిక తప్పిదమా? ఏదో ఒకటి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక తప్పిదమైతే వెంటనే సరిదిద్దాలని కోరుతున్నారు. అలాగే దరఖాస్తు గడువును కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.