Karur stampede : తమిళనాడులోని విజయ్ సర్కార్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే విజయ్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల్ని కోర్టు రద్దు చేసింది. ఈ ఉద్యోగాల నియామకం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో విజయ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత సీఎం విజయ్ బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ సీవీ కార్తికేయన్, జస్టిస్ ఆర్ శక్తివేల్ ఆధ్వర్యంలోని బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లను ఉల్లంఘించడమే అని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఇలా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే, భవిష్యత్‌లో ఈ తరహా ఉద్యోగాల కేటాయింపునకు ఇది తలుపులు తెరిచినట్లు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. చాలామంది బాధితులు ఇదే రకంగా ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని హైకోర్ట్ బెంచ్ వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు జారీ చేసేముందు రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ‘‘ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వం అలా ఇచ్చేయకూడదని, అది కష్టపడి సాధించుకోవాలని, దాని విలువను, గౌరవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు కూడా ఈ విచారణను పర్యవేక్షిస్తోందని, అందువల్ల ఈ కేసు విచారణపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కోర్టు తెలిపింది.