బూర్గంపహాడ్, జూలై 27 : గోవును జాతీయ ప్రాణి(మాత)గా గుర్తించి రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించాలని, దేశ వ్యాప్తంగా సాధువులు, పీఠాధిపతులు, గో ప్రేమికులు గత పది నెలలుగా సేకరించిన సంతకాలను సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సనాతన హిందూ ధర్మ గో సామాజిక సేవకుడు, జాతీయ మానవ, జంతు హక్కుల పరిరక్షణ ప్రతినిధి టి.గోవిందరెడ్డి కలెక్టర్ అంకిత్‌ను కలిసి సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. గోవధ శాలలను పూర్తిగా నిర్మూలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను కాపాడాలని, ప్రభుత్వాలే గోశాలలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం గోసంరక్షణలో భాగంగా గోఉత్పత్తుల తయారీకి కృషి చేయాలన్నారు. గోవు ఎక్కడైతే పూజింపబడుతుందో, రక్షింపబడుతుంతో ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తి హిందూ సనాతన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గో ప్రచార సమితి సభ్యులు హేమంత్, పిచ్చయ్య పాల్గొన్నారు.