Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ పిలిచారు. కానీ అది పవన్ కల్యాణ్‌కు వినబడలేదు. దీంతో ప్రసంగం ముగించుకుని వేదికపై తనకు కేటాయించిన సీటు దగ్గరకు వెళ్లి కూర్చుని, నాదెండ్ల మనోహర్‌తో మాటల్లో పడిపోయారు. దీంతో పవన్ కల్యాణ్‌ను పిలవమని పక్కనే కూర్చున్న ఏపీ సీఎం చంద్రబాబుకు మోదీ సూచించారు.
ప్రధాని మోదీ పిలవడంతో పవన్ కల్యాణ్ హడావుడిగా ఆయన దగ్గరకు వెళ్లారు. అప్పుడు దగ్గరకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అనంతరం నవ్వుతూ పవన్ కల్యాణ్ చేతిలో ఒక చాక్లెట్ పెట్టారు. అది చూసి పవన్ కల్యాణ్ మురిసిపోయారు. ఇదంతా పక్కనే ఉన్న చంద్రబాబు కూడా గమనించి తెగ నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోడీ pic.twitter.com/CGPqLaTcJA
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025
అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు అమరావతి రైతులు నలిగిపోయి.. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని అన్నారు. దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసిందని మండిపడ్డారు. ధర్మయుద్ధంలో చివరకు అమరావతి రైతులే విజయం సాధించారని అన్నారు. రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. అమరావతి రైతుల త్యాగాలను మరిచిపోలేమని, వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని చెప్పారు. రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామన్నారు. అమరావతి రైతులు భూములు ఇవ్వడం మాత్రమే కాదు.. రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారని ప్రశంసించారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్రానికే కాదు.. దేశానికే తలమానికంగా నిలుస్తుందని అన్నారు.