దుండిగల్, మే 2: పట్టా భూమి పేరుతో చెరువునే స్వాహా చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఏకంగా చెరువు మధ్యలోనే ఫెన్సింగ్ వేసి, పశువుల కొట్టాల పేరుతో ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మించుకున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రెవెన్యూ అధికారులను అడిగితే.. విషయాన్ని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని సర్వేనెంబర్ 182లో గ్రామానికి చెందిన కొందరికి సుమారు రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. దీని పక్కనే సర్వేనెంబర్ 190, 183 ప్రభుత్వ భూములు ఉన్నాయి. 183 లోనే 10 ఎకరాలలో మహబూబ్ కుంట (చెరువు)విస్తరించి ఉంది. ఇప్పటికే అక్రమణకు గురైన మహబూబ్కుంట కుచించకపోగా మిగిలిన దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు చెరువులోని భూమి తమ పట్టా భూమిలోకి వస్తుందంటూ ఏకంగా చెరువులోని సగ భాగాన్ని విభజిస్తూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పశువుల కొట్టాల పేరుతో సర్వే నెంబర్ 190, ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద షెడ్లనే ఏర్పాటు చేశారు. ఇదంతా రెవిన్యూ అధికారులకు తెలిసినప్పటికీ మౌనంగా ఉంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, చెరువును రక్షించడంతోపాటు ఎఫ్టీఎల్ పరిధిలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సర్వే చేసి హద్దురాళ్లు సైతం ఏర్పాటు చేశారని , వాటిని తొలగించి నిర్మాణాలు చేపట్టడం వెనుక అధికారుల సహకారం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో మహబూబ్కుంట కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై కుత్బుల్లాపూర్ డిప్యూటీ తహశీల్దార్ మల్లికార్జున్ను వివరణ కోరగా.. సూరారంలోని మహబూబ్ కుంటలో ఫెన్సింగ్ వేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీంతో అధికారులను పంపించి పరిశీలించామని పేర్కొన్నారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.