హయత్‌నగర్, మార్చి 3 : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్, నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ 28వ సర్వసభ్య సమావేశం మంగళవారం హయత్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో వాడివేడీగా జరిగింది. ఇటీవల పెండింగ్ పాల బిల్లుల కోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటుకు 234 మంది సొసైటీ చైర్మన్లు మదర్ డెయిరీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంస్థ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మదర్ డెయిరీ సంస్థ ఆడిట్ నివేదికలు, చిట్యాల భూముల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు.
సంస్థకు బ్యాంకు రుణాల కోసమే లాభాలు ఉన్నట్లుగా చూపించామని తెలిపారు. పాల బిల్లుల కోసమే ప్రస్తుత పాలకవర్గం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పాలకవర్గం అవగాహన లోపాలు, అనుభవంలేని పాలన కొనసాగించడం సంస్థ నష్టాలకు కారణమని విమర్శించారు. ఎన్డీడీబీతో ఒప్పంద సంస్థకు నష్టమే కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ ఐదున్నర నెలలుగా రైతులకు పాల బిల్లులు చెల్లించడం లేదని, పాలకవర్గం రాజకీయాలను పక్కన పెట్టి వెంటనే బాధిత రైతులకు బిల్లులు చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సంస్థ చైర్మన్ స్పందించకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
సంస్థ గత చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, అధికారుల అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చైర్మన్‌ను రైతులే నేరుగా ఎన్నుకునేలా బైలాను రూపొందించాలని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం సంస్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్డీడీబీతో ఒప్పందం తప్పనిసరి అని పేర్కొన్నారు. 2015-16 వరకు లాభాల్లో ఉన్న సంస్థ క్రమంగా నష్టాల బాట పట్టడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.
సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలపై తాను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు సిద్ధమా.?అని సవాల్ విసిరారు. ఎన్డీడీబీ ఒప్పందంలో ఎలాంటి దాపరికం లేదని, ఒప్పందం చేసుకున్న వెంటనే రైతుల పాల బిల్లుల కోసం రూ.10 కోట్లు చెల్లించడానికి ఎన్డీడీబీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. చైర్మన్ సూచన మేరకు సంస్థ ప్రతినిధి సామ మహిపాల్‌రెడ్డి ఒప్పంద పత్రాలను చదివి వినిపించారు. పాడి రైతులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, మార్చి నెలాఖరుకు సంస్థ ఒప్పందం పూర్తవుతుందని తెలిపారు. రైతులకు మేలు జరిగేలా ఉంటేనే ఎన్డీడీబీతో ఒప్పందం తమకు అంగీకారమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాటిపల్లి లింగారెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.