దుండిగల్,మార్చి3ః ప్రేమపేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, లైంగికదాడికి పాల్పడిన కేసులో మేడ్చల్ ప్రత్యేక ఫోక్సో కోర్టు నిందితుడికి 28.6 ఏండ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.బాధితురాలికి రూ.5లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ బాబుమియా కొడుకు షేక్ నజీర్ అలియాస్ అహ్మద్(35) కొన్ని ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం వలసవచ్చి,కుత్బుల్లాపూర్ పరిధిలోని గాగిళ్లాపూర్‌లో నివాసముంటూ కూలీ పనులు చేసుకునేవాడు..ఈ క్రమంలో 2021లో తను పనిచేస్తున్న యజమాని కూతురు 17 ఏండ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై ఫోక్సో కేసునమోదు చేసిన నాటి దుండిగల్ సీఐ రమణారెడ్డి నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించాడు.ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి బలమైన సాక్ష్యాలను సమర్పించారు. మేడ్చల్ ప్రత్యేక ఫోక్సో కోర్టు న్యాయమూర్తి కే.వెంకటేష్ మంగళవారం తుదితీర్పును వెలువరించారు.నిందితుడికి 20 ఏండ్ల కఠినకారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానాను విధించారు.ఒక వేళ జరిమానా చెల్లించని పక్షంలో ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించారు.
అదే సమయంలో బాధితురాలికి రూ.5లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. అదే విధంగా ఐపీసీ సెక్షన్ 363 ప్రకారం 5 సంవత్సరాల కఠిన కారాగార ఐపీసీ సెక్షన్ 344 కింద 3 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 6నెలల సాధారణ జైలు శిక్ష,ఐపీసీ సెక్షన్ 506 కింద ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. కాగా నిందితుడు షేక్ నజీర్ అలియాస్ అహ్మద్ వికారాబాద్ జిల్లా యాలాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020లో జరిగిన ఓ కేసులో దోషిగా తేలడంతో జీవితఖైదు శిక్షకు గురై 2024 ఆగష్టు నెల నుండి చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.