Banana Peel | అరటి పండ్లను తినగానే ఎవరైనా సరే తొక్కను పడేస్తుంటారు. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పండ్లుగా ఇవి పేరుగాంచాయి. ఈ పండ్లను తింటే మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అరటి పండ్లను తిన్న వెంటనే తొక్కను పడేస్తారు కానీ.. ఈ లాభాలు తెలిస్తే ఇకపై అలా చేయరు. అరటి పండు తొక్కను ఉపయోగించి పలు ఇంటి చిట్కాలను పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసేందుకు కూడా అరటి పండు తొక్కలు పనిచేస్తాయి. అరటి పండు తొక్కను ఉపయోగించి ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించుకోవచ్చు. అరటి పండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. మొటిమలపై అరటి పండు తొక్క లోపలి భాగాన్ని రుద్దుతుండాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమలను తగ్గించుకోవచ్చు.
అరటి పండు తొక్కలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. చర్మానికి కాంతిని తెస్తాయి. చర్మంపై ఉండే నల్లని మచ్చలను తొలగిస్తాయి. హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. చర్మంపై ఆయా చోట్ల అరటి పండు తొక్కను మసాజ్ చేసినట్లు రాస్తుంటే ఫలితం ఉంటుంది. ఆయా సమస్యలను తగ్గించుకోవచ్చు. అరటి పండు తొక్కలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల పొడిబారిన చర్మం ఉన్నవారికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో మసాజ్ చేస్తుంటే చర్మానికి తేమ లభిస్తుంది. పొడిబారడం తగ్గుతుంది. చర్మం పగలడం తగ్గుతుంది. చర్మం తేమగా మారి సహజసిద్ధమైన నిగారింపును పొందుతుంది.
పెరుగు, అరటి పండు తొక్క, కాస్త తేనె వేసి మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని తలకు రాయాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండు తొక్కలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రోజూ రుద్దుతుండాలి. ఇలా చేస్తుంటే దంతాలపై ఉండే పాచి, గార, పసుపుదనం పోతాయి. దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
కళ్ల కింద నల్లని వలయాలతో ఇబ్బందులు పడుతున్నవారు అరటి పండు తొక్కలో ఉండే నార లాంటి పదార్థాన్ని నల్లని వలయాలపై 20 నిమిషాల పాటు ఉంచాలి. రోజూ ఇలా చేస్తుంటే సమస్య తగ్గుతుంది. పురుగులు కుట్టిన చోట అరటి పండు తొక్కతో మసాజ్ చేయాలి. దీంతో దురద, వాపు తగ్గి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా అరటి పండు తొక్కతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే మీరు ఇంట్లో మొక్కలను పెంచుతుంటే అరటి పండు తొక్క ఆ మొక్కలకు ఎరువుగా కూడా పనిచేస్తుంది. కనుక అరటి పండ్లను ఇకపై తింటే వాటి తొక్కలను అసలు పడేయకండి.