Team India : స్వదేశంలో వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం.. ఆ వెంటనే రికార్డు స్కోర్‌తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్. సొంతగడ్డపై టీమిండియా ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. బంగ్లాదేశ్‌పై చిరస్మరణీయ టెస్టు విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)ఫైనల్ రేసులో ముందున్న భారత జట్టు స్వదేశంలో మరో సిరీస్ ఆడనుంది. బంగ్లాను చావుదెబ్బ కొట్టిన టీమిండియా ఇక న్యూజిలాండ్ (Newzealand)తో అమీతుమీ తేల్చుకోనుంది.
డబ్ల్యూటీసీలో హ్యాట్రిక్ ఫైనల్‌పై కన్నేసిన రోహిత్ సేన అందుకు కివీస్‌ను వైట్‌వాష్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒక్కరోజులోనే 400లు కొట్టగల జట్టుగా ఎదగాలి. అవసరమైతే రెండు రోజులు బ్యాటింగ్ చేసి మరీ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలగాలి. టీమిండియాలో ఈ విధమైన అనుకూలత కోసం ఎదురు చూస్తున్నాం. టెస్టు క్రికెట్ అంటే అదే మరి. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ రెండూ చేయగల సమర్ధులైన బ్యాటర్లు ఉన్నారు.
Gautam Gambhir:
“We want to be a team that can score 400 in a day and also a team that can bat 2 days”. 👌🔥 pic.twitter.com/hPstyJ5GX2
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024
ఒక్కరోజులోనే 400 కొట్టడం అనేది మ్యాచ్ గెలవడం కోసమే. అదీ కాదు పరిస్థితులు తారుమారైతే రెండు రోజులు క్రీజులో ఉండి డ్రా చేసుకోవాలి. సుదీర్ఘ ఫార్మాట్లో ఇదే మా రెండో, మూడో ప్రాధాన్య అంశం’ అని గంభీర్ మీడియా సమావేశంలో తెలిపాడు. కాన్పూర్ టెస్టులో ‘బజ్ బాల్’ను తలదన్నేలా ఆడిన భారత ఆటగాళ్లు.. ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై బౌండరీలతో విరుచుకుపడ్డారు.
𝙋𝙪𝙧𝙚 𝙚𝙣𝙩𝙚𝙧𝙩𝙖𝙞𝙣𝙢𝙚𝙣𝙩 𝙬𝙞𝙩𝙝 𝙩𝙝𝙚 𝙗𝙖𝙩!
⏪ WATCH all 2️⃣2️⃣ sixes from India’s record breaking innings in Hyderabad 🎥🔽#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 14, 2024
ఓపెనర్ సంజూ శాంసన్(111) సుడిగాలిలా చెలరేగి 40 బంతుల్లోనే తొలి వంద కొట్టేయగా.. కెప్టెన్ సూర్య తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దరి విధ్వంసానికి హర్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ మెరుపులు తోడవ్వడంతో టీ20ల్లో టీమిండియా 297 పరుగులతో చరిత్ర లిఖించింది. ఇదే విధంగా టెస్టుల్లో ఆడితే తమ జట్టు ఒక్కరోజులోనే 400 కొట్టగలదని గౌతీ అభిప్రాయపడడంలో వింతేమీ లేదు కదా.
ఐసీసీ ట్రోఫీల్లో టెస్టు గద (Test Mace) ఒక్కటే టీమిండియాకు అందని ద్రాక్షలా మారింది. రెండు వన్డే వరల్డ్ కప్‌లు, రెండు టీ20 ప్రపంచ కప్‌లు.. గెలుపొందిన భారత్.. ‘టెస్టు చాంపియన్ ట్యాగ్’ మాత్రం సాధించలేకపోయింది. రెండు పర్యాయాలు ఫైనల్ చేరినా నిరాశే మిగిలింది. ఇప్పుడు మరోసారి భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం రానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. న్యూజిలాండ్‌ను 3-0తో ఓడిస్తే ఫైనల్ చేరడం పక్కా.