లక్నో: తనను వదిలేసిన భర్త, అత్తింటి వారిపై ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపించింది. (woman burns effigies of husband) ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం దసరా సందర్భంగా ప్రియాంక అనే మహిళ ముస్కరాలోని తన భర్త, అత్తమామల ఇంటి ముందు వారి ఫొటోలతో కూడిన మూడు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపిస్తూ వాటిని దహనం చేసింది. ‘రావణుడి లాంటి వారిని’ తిరస్కరించాలని, కాల్చివేయాలని సమాజానికి సందేశం ఇచ్చింది.
కాగా, 14 ఏళ్ల కిందట సంజీవ్ దీక్షిత్‌తో తనకు వివాహమైందని ప్రియాంక తెలిపింది. అయితే పెళ్లికి ముందే సోదరి స్నేహితురాలైన పుష్పాంజలితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. పెళ్లి తర్వాత తనను వదిలేసి ఆమెతో కలిసి జీవిస్తున్నాడని చెప్పింది. అత్తమామలు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని విమర్శించింది.
మరోవైపు 14 ఏళ్లుగా న్యాయం కోసం తాను పోరాడుతున్నట్లు ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరింది. తన భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. కాగా, భర్త, అత్తమామల ఫొటోలున్న రావణాసురల దిష్టిబొమ్మలను ఆమె దహనం చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.