Gautam Gambhir : భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తన మార్క్ చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో మెంటార్‌గా హిట్ కొట్టిన గౌతీ టీమిండియాను మరింత సానబెట్టేందుకు వ్యూహం రచిస్తున్నాడు. అందులో భాగంగానే గంభీర్ తన సొంత టీమ్ వేట మొదలెట్టాడు. తనకు నచ్చిన సహాయక సిబ్బందిని తీసుకుంటానని ఇప్పటికే బీసీసీఐకి చెప్పేసిన అతడు.. బౌలింగ్, ఫీల్డింగ్, అసిస్టెంట్ కోచ్‌లను ఖరారు చేసే పనిలో ఉన్నాడు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన రియాన్ టెన్ డస్చేట్( Ryan ten Doeschate)ను తన స్టాఫ్‌లో చేర్చుకునేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. డస్చేట్ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించాల్సిందిగా బీసీసీఐని అతడు కోరే అవకాశముంది.
రియాన్ టెన్, గంభీర్

ఐపీఎల్ 17వ సీజన్లో గంభీర్, డస్చేట్లు కోల్‌కతాను గెలుపు తోవ తొక్కించారు. ఫీల్డింగ్ కోచ్‌గా డస్చేట్ పనితీరు గౌతీకి బాగా నచ్చింది. అంతేకాదు కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ క్రికెట్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్స్‌లో పనిచేసిన అనుభవం డస్చేట్కు ఉంది. పదిహేడో సీజన్లో గౌతీ.. పలు సందర్బాల్లో ఈ డచ్ దేశస్థుడిని ప్రశంసల్లో ముంచెత్తాడు.

‘నా 42 ఏండ్ల సర్వీస్‌లో నిస్వార్ధపరుడైన వ్యక్తిని చూడలేదు. నేను కలిసి ఆడిన, పనిచేసిన వాళ్లతో ఇతడే నిజమైన జట్టు మనిషి. ఇసుమంత స్వార్థం లేని వ్యక్తి. అతడి కోసం నేను బుల్లెట్‌కైనా ఎదురెళ్లుతా’ అని గంభీర్ అన్నాడు. అంతర్జాతీయ టీ20 లీగ్స్‌లోనూ ఫీల్డింగ్ కోచ్‌గా విజయవంతమైన డస్చేట్ను తన సహాయక సిబ్బందిలోకి తీసుకోవాలని గంభీర్ పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే కోల్‌కతా సహచరులైన అభిషేక్ నాయర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా.. మాజీ పేసర్ వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా గంభీర్ ప్రతిపాదించాడు. అయితే.. బీసీసీఐ మాత్రం వెటరన్ స్పీడ్‌స్టర్ జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని భావిస్తోందని టాక్.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ టీమిండియా కొత్త హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా (Jai Shah) ఎక్స్ వేదికగా గౌతీ నియామకాన్ని అధికారికంగా వెల్లడించాడు. రెండేండ్లు గంభీర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. త్వరలో జరుగబోయే శ్రీలంక సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌కు తొలి పరీక్ష ఎదురవ్వనుంది.