ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు(ECB)కే పట్టం కట్టింది ఐసీసీ. వచ్చే సీజన్ ఒక్కటే కాదు మరో రెండు ఫైనల్స్ బాధ్యతను కూడా ఈసీబీకే రాసిచ్చింది. 2027, 2029, 2031 టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు ఈసీబీనే ఆతిథ్వం ఇవ్వనుంది.
గత మూడు సీజన్ల డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్‌లోనే జరిగాయి. దాంతో.. ఈసీబీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదని.. వచ్చే సీజన్లకు వేదికను మారిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ, ఈసీబీ అత్యంత పకడ్బందీగా ఈ మ్యాచ్‌లను నిర్వహించింది. అంతేకాదు అక్కడి ప్రేక్షకులు ఐదు రోజుల ఆటను చూసేందుకు భారీగా తరలివచ్చారు కూడా. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ.. డబ్ల్యూటీసీ టైటిల్ పోరును సమర్ధంగా నిర్వహించిందినందున.. వేదికను మార్చడం సరైంది కాదని భావించింది. దాంతో.. 2027 ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ఆశ పడిన బీసీసీఐకి భంగపాటు ఎదురైంది. ఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇంగ్లండ్ బోర్డు సంతోషం వ్యక్తం చేసింది.
🏴 are confirmed hosts for the 2027, 2029 & 2031 WTC finals 🏆
Despite some speculation that the contest could be set for a relocation to India from 2027 onwards, the ICC cited the ECB’s “successful track record in hosting recent finals” in confirming its decision pic.twitter.com/PER7w0BxZs
— ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2025
టీ20లు.. ఫ్రాంచైజీ క్రికెట్ల విస్తరణతో కళ తప్పుతున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు ఊపిరిలూదేందుకు ఐసీసీ 2019-21లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను తెరపైకి తీసుకొచ్చింది. తొలి ఎడిషన్‌ను ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ మైదానంలో నిర్వహించారు. భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ (Newzealand) మొట్టమొదటి ఛాంపియన్‌గా అవతరించింది. రెండో సీజన్ ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోనే. ఈసారి కూడా ఫలితం మారలేదు. ఓవల్ స్టేడియంలో టీమిండియాను 209 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
ఈమధ్యే లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎడెన్ మర్క్రమ్ సూపర్ సెంచరీకి తోడు.. రబడ విజృంభణతో దక్షిణాఫ్రికా (South Africa) సంచలనం సృష్టించింది. అంతే.. రెండోసారి టెస్టు గదను తన్నుకుపోవాలనుకున్న కమిన్స్ సేనుకు చెక్ పెట్టింది. తొలిసారి జగజ్జేతగా నిలిచిన ప్రొటీస్ జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవాలనే తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకుంది.