James Anderson : సుదీర్ఘ ఫార్మాట్లోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జేమ్స్ అండర్సన్ (James Anderson) ఇంగ్లండ్ జట్టుకు విశేష సేవలందించాడు. నలభై ఏళ్లు దాటినా యువకులతో పోటీ పడి బౌలింగ్ చేసిన జిమ్మీ.. నిరుడు వీడ్కోలు పలికాడు. అతడి గౌరవార్థం వాళ్ల బోర్డు అండర్సన్ – టెండూల్కర్ (Anderson- Tendulkar) ట్రోఫీకి శ్రీకారం చుట్టింది. తన పేరుతో ట్రోఫీ నిర్వహించడంపై ఎట్టకేలకు ఇంగ్లండ్ వెటరన్ స్పందించాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ పేరు పక్కన తన పేరు చూసుకొని ఎంతో గర్వంగా ఫీలయ్యానని చెప్పాడీ లెజెండరీ పేసర్.
‘క్రికెట్లో సచిన్ ఒక దిగ్గజం. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ సమయంలో అతడి పేరు పక్కన నా పేరు చూసి నేను అతడికి సరిసమానం కాదుగా అని మనసులో అనుకున్నా. కానీ, అత్యుత్తమ ఆటగాడైన సచిన్ పేరు.. నా పేరు పక్కపక్కనే ఉండడంతో చాలా గర్వంగా అనిపించింది. మన పేరుతో ట్రోఫీ నిర్వహించడమే గొప్ప విషయం. అలాంటిది గ్రేటెస్ట్ క్రికెటర్ అయిన మాస్టర్ బ్లాస్టర్ సరసన నాకు స్థానం దక్కడం అమిత సంతోషాన్నిచ్చింది.
🥁 Introducing…
The Anderson–Tendulkar Trophy 🏆
— England Cricket (@englandcricket) June 19, 2025
నేను పిల్లాడిగా అతడి ఆటను చూశాను. ఆ తర్వాత అతడికి ప్రత్యర్థిగా ఆడాను. భారత దేశ కీర్తిని తన భుజాలపై మోసిన సచిన్ ఒక ఐకానిక్ ప్లేయర్. అలాంటి వ్యక్తి పేరుతో ట్రోఫీని షేర్ చేసుకోవడం నిజంగా అదృష్టమే’ అని అండర్సన్ వెల్లడించాడు. గొప్ప క్రికెటర్లుగా ఖ్యాతి గడించిన సచిన్ 200 టెస్టులు ఆడగా.. జిమ్మీ 188 మ్యాచుల్లో 704 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్టే లోకంగా బతికే అండర్సన్ 42 ఏళ్ల వయసులో ‘ది హండ్రెడ్ లీగ్’లో కుర్ర బ్యాటర్లను బెంబేలెత్తించేందుకు సిద్ధమవుతున్నాడు.
From the James Anderson end….
Sir James Anderson joins Manchester Originals for The Hundred 2025! 🤩 pic.twitter.com/pm0sOYLIu0
— The Hundred (@thehundred) July 15, 2025
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు సిరీస్‌కు 2007లో 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల బోర్డులు ఇంగ్లండ్‌లో జరుగబోయే సిరీస్‌ను మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరుతో నిర్వహించాలని నిర్ణయించాయి. అప్పటినుంచి 2024 వరకూ పటౌడీ పేరుతోనే ట్రోఫీని జరిపారు. అయితే.. నిరుడు జేమ్స్ అండర్సన్ వీడ్కోలు పలకడంతో అతడిని గౌరవించాలనుకుంది ఈసీబీ.
అందుకే.. పటౌడీ ట్రోఫీకి మంగళం పాడి.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరును జతచేసింది. ఈసీబీ ప్రతిపాదనపై వివాదం చెలరేగినా చివరకు పటౌడీ పేరును ట్రోఫీలో కొనసాగిస్తామని మాట ఇచ్చింది ఈసీబీ. విన్నింగ్ కెప్టెన్‌కు పటౌడీ మెడల్ (Pataudi Medal)ను కానుకగా ఇస్తామని చెప్పి సమస్యకు ముగింపు పలికింది.