దామరగిద్ద : నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ( Kodangal lift irrigation ) కింద భూములు కోల్పోతున్న కానుకుర్తి రైతులను( Farmers) ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్( Gopal) , మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్( Mahesh Kumar) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో వారు మాట్లాడారు.
ప్రభుత్వం ఎకరాకు రూ. 14 లక్షలు ఇస్తాననడం సమంజసం కాదని అన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా 30 లక్షల పైబడి ధర ఉందనిఅన్నారు. జయమ్మ చెరువు క్రింద 792 ఎకరాల భూమి సేకరిస్తున్నారని, ఇందులో కొంతమంది రైతులకు సంబందించి ఉన్న మొత్తం భూమి కోల్పోతున్నారని అన్నారు. అలాంటి వారికి భూమికి బదులు భూమి చూయించాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం ఆపాలని, రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చి వారిని సంతృప్తి పరిచిన తరువాత భూములు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్ట్ సైజ్ తగ్గించి లిఫ్ట్ ద్వారా కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళాలని అన్నారు. మొగులప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బస్వరాజ్, రామకృష్ణ, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్, జోషి,శ్రీహరిగౌడ్,షేరీ వెంకట్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి,శివకుమార్, గౌస్, ఆశప్ప,అశోక్,షేకర్, పంకజ్,రైతులు తదితరులు పాల్గొన్నారు.