Shikhar Dhawan : ఈమధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ (Shikhar Dhawan) లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legneds League Cricket)లో మెరిశాడు. తనదైన షాట్లతో అభిమానులను అలరించిన గబ్బర్.. ఉన్నట్టుండి ఓ పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారాడు. దాంతో, అసలు గబ్బర్‌కు ఏమైంది? అతడికి ఆరోగ్యం బాగానే ఉందా? అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంతకూ ధావన్ ఏం పోస్ట్ పెట్టాడు? అది ఎందుకంత వైరల్ అయింది? తెలుసుకుందాం.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్ నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. ఏ విషయాన్నైనా అభిమానులతో పంచుకుంటాడు. అలాంటిది అతడు గురువారం రాత్రి 1030 గంటలకు నిద్ర పట్టడం లేదు. సాయం చేయండి అనే పోస్ట్ పెట్టాడు. దాంతో, అతడి ఆరోగ్యం దెబ్బతినిందా? ఏమై ఉంటుంది? అని ఫ్యాన్స్ ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.
Can’t fall asleep. Help
— Shikhar Dhawan (@SDhawan25) October 24, 2024
ఆ పోస్ట్ చూసిన చాలామంది ధైర్యంగా ఉండు చాంపియన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. భార్య అయేషా ముఖర్జీతో విడాకులు, కుమారుడు జొరావర్‌కు దూరంగా ఉండాల్సి రావడం కారణంగానే ధావన్ మానసికంగా సతమతం అవుతున్నాడని కొందరు అంటున్నారు. అయితే.. ఈ పోస్ట్ వెనుక మర్మం ఏంటో ధావన్ చెబితేగానీ తెలియదు అంటూ మరికొందరు వాపోతున్నారు.
టీమిండియా తరఫున విజయవంతమైన ఓపెనర్లలో ధావన్ ఒకడు. రోహిత్ శర్మకు జోడీగా ఈ లెఫ్ట్ హ్యాండర్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. హిట్‌మ్యాన్ జతగా 2012 నుంచి 2021 మధ్య 115 ఇన్నింగ్స్‌లో 5,148 పరుగులు జోడించాడు. అయితే.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) దూసుకు రావడంతో అతడి స్థానానికి ఎసరొచ్చింది. స్వదేశంలో శ్రీలకం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో గిల్, రోహిత్ ద్వయం బాగా హిట్ అయింది. దాంతో, ఇక ధావన్ అవసరం లేకపోయింది.
ఓపెనర్‌గా రోహిత్‌తో పాటు గిల్, ఇషాన్ కిషన్(Ishan Kishan), యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. దాంతో, ప్రపంచ కప్ (ODI World Cup 2023) జట్టులోనూ ధావన్‌కు అవకాశం దక్కలేదు. అయితే.. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం ఏదో ఒకరోజు చాన్స్ రాకపోతుందా? అనే నమ్మకంగా ఉండేవాడు. అయితే.. ఇక తనకు చాన్స్ వచ్చే పరిస్థితులు లేవని గ్రహించిన గబ్బర్ తనకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికాడు.
తన స్టయిలిష్ ఆటతో రికార్డులు నెలకొల్పిన ధావన్.. 2012 అక్టోబర్‌లో అయేషా ముఖర్జీని పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే మొదటి భర్తతో విడిపోయిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 9 ఏండ్ల తర్వాత దాంపత్య జీవితం తర్వాత ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు.
అయేషా 2021లో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. వీళ్ల కుమారుడు జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు.