అమరావతి : కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు(Rammohan Naidu ) శుక్రవారం తిరుమలను దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి రాక సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాతో మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన నాలుగు నెలల్లో తిరుమల (Tirumala) ను ప్రక్షాళన చేశామని, తిరుమలకు వచ్చే భక్తులు నేడు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం సమన్వయంతో రాష్ట్రం గాడిలో పడిందని అన్నారు. ఏపీని అభివృద్ధి చేసే దిశగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 61,004 మంది భక్తులు దర్శించుకోగా 20,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.48 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.