IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలిరెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన ఢిల్లీ మూడో పోరులోనూ విజయభేరి మోగించింది. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను 25 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్(77) అర్ధ శతకంతో చెలరేగగా.. బౌలర్లు ఆదిలోనే వికెట్లు తీసి చెన్నైని ఓటమి అంచులోకి నెట్టారు. పవర్ ప్లేలో 41 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయిన సీఎస్కే ఏ దశలోనూ కోలుకోలేదు. ఆఖర్లో విజయ్ శంకర్(68 నాటౌట్), ఎంఎస్ ధోనీ (30 నాటౌట్)లు పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
ఛేదన అంటే చాలు చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సీఎస్కేచతికిలపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 184 పరుగుల ఛేదనలో టాపార్డర్ వైఫల్యంతో ఓటమి అంచుల్లోకి వెళ్లింది. తొలి ఓవర్లోనే రిటర్న్ క్యాచ్‌తో రచిన్ రవీంద్ర(3)ను వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డెవాన్ కాన్వే(13)ను విప్రజ్ నిగమ్ బోల్తా కొట్టించాడు.
𝐰𝐰𝐰.delhicapitals.win
Thank you, Chepauk 🤗 pic.twitter.com/aLEkKB8v98
— Delhi Capitals (@DelhiCapitals) April 5, 2025
ఆ కాసేపటికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5) పెద్ద షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపద్బాందవుడు శివం దూబే(18), రవీంద్ర జడేజా(2)లు ఘోరంగా విఫలమయ్యారు. దూబే ఔట్ అయ్యాక.. విజయ్ శంకర్(68 నాటౌట్) అండగా ఎంఎస్ ధోనీ(30 నాటౌట్) చివరివరకూ పోరాడాడు. ఆరో వికెట్‌కు 84 పరుగులు జోడించినా ఓటమి తప్పించలేకపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న ఢిల్లీకి సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. సున్నాకే వికెట్ పడిన వేళ కేఎల్ రాహుల్(77), అభిషేక్ పొరెల్(33)లు దూకుడుగా ఆడి సీఎస్కేపై ఒత్తిడి పెంచారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పొరెల్ వెనుదిరగడంతో 54 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్(21) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్‌గా భారీ సిక్సర్ బాదిన అతడు.. నూర్ అహ్మద్ బౌలింగ్‌ను అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దాంతో, 90 వద్ద ఢిల్లీ మూడో వికెట్ పడింది.
కేఎల్ రాహుల్(77)
అక్షర్ పటేల్ వెనుదిరిగాక కేఎల్ రాహుల్ గేర్ మార్చాడు. చెన్నై స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో చెపాక్‌ను హోరెత్తించాడు. 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకన్న రాహుల్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. సమీర్ రిజ్వీతో కలిసి నాలుగో వికెట్‌కు 56 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. డిల్లీ స్కోర్ బోర్డును ఉరికిస్తున్న ఈ జోడీని ఖలీల్ విడదీశాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(21) రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జట్టు స్కోర్ 180 దాటించాడు. పథిరన వేసిన 20వ ఓవర్లో రాహుల్, ఫినిషర్ అశుతోష్ శర్మ(1)లు ఔట్ కావడంతో ఢిల్లీ 183 పరుగులకే పరిమితమైంది.