వనపర్తి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గురువారం ఆక్సిజన్ సిలిండర్ లీకేజీతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. టెక్నీషియన్స్‌తో చేయించాల్సిన పనిని ఎలక్ట్రీషియన్‌తో చేయించడంతోనే ఈ లీకేజీ ఘటన చోటుచేసుకున్నది. చిన్నపిల్లల విభాగంలో అత్యవసర నిమిత్తమై ఆక్సిజన్ పెట్టేందుకు ఎలక్ట్రిషియన్ రంజిత్ ప్రయత్నించారు. అధిక మొత్తంలో ఆక్సిజన్ సిలిండర్‌ను ఓపెన్ చేయడంతో క్యాప్ పగిలి శబ్దం వచ్చింది. దీంతో రంజిత్ చేతులకు గాయాలు కాగా, వెంటనే చికిత్స అందించారు. అక్కడే ఉన్న నర్సు ఆక్సిజన్ సిలిండర్ శబ్దానికి భయంతో పరుగెత్తబోయి జారిపడ్డారు. ఓ చిన్న పొరపాటుతో ఇద్దరికి గాయాలు కావడం.. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై ఆర్ఎంవో బంగారయ్యను సంప్రదించగా.. సమయానికి టెక్నిషియన్ లేనందున ఎలక్ట్రీషియన్‌తో ఆక్సిజన్ సిలిండర్ పెట్టే ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఆ సమయానికి గ్యాస్ ఆపరేటర్ నవీన్‌కుమార్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఉన్నాడని ఆర్ఎంవో చెప్పారు.