Hyderabad | కార్వాన్ : రెండు గ్రూపుల మధ్య హింసాత్మక దాడి జరగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడకు చెందిన భరత్ అనే వ్యక్తి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌గా నమోదై ఉన్నాడు. రామ్బాగ్కు చెందిన దినేశ్‌కు పాత కక్షలు ఉన్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి దాదాపు 12 గంటల ప్రాంతంలో మొగల్ కానాల పిల్లర్ నెంబర్ 102 సమీపంలో భరత్ అతని అనుచరులు సత్యసాయి వర్ధన్, శివలతో వెళుతుండగా అక్కడే ఉన్న రాంబాగ్‌కు చెందిన దినేష్ అతని అనుచరులు అఖిలేశ్వర్ అలియాస్ నాని, రవి, నరేశ్‌లతో గొడవకు దిగారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరగా.. భరత్ దినేశ్‌ను బూతులు తిట్టాడు. దీంతో దినేష్ భరత్‌పై రాయితో దాడికి పాల్పడి తలపై కొట్టాడు. భరత్‌కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భరత్ అనుచరుడు సత్యసాయి వర్ధన్‌పై కూడా దాడి చేయడంతో అతని ముక్కు పగిలిపోయి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఈ గొడవ జరుగుతుండగానే ఇరువైపుల నుండి తమ తమ అనుచరులకు ఫోన్లు చేయడంతో రెండు గ్రూపులకు చెందిన యువకులు పిల్లర్ నెంబర్ 102 వద్దకు చేరుకొని ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆందోళన వాతావరణం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలకు గురైన భరత్, సత్యసాయి వర్ధన్‌ను ఆసుపత్రికి తరలించారు. రెండు గ్రూపులు కూడా గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఒకరిపై ఒకరు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి దాడి జరిగిన సమయంలో ఉన్న యువకులంతా పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఈ గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.