Women’s Asia Cup : శ్రీలంక గడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్(Women’s Asia Cup) ఆఖరి అంకానికి చేరింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగియడంతో సెమీస్ పోరుకు రేపటితో తెరలేవనుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న భారత జట్టు (Team India) దంబుల్లా స్టేడియం వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటలకు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రాత్రి 7:00 గంటలకు ఆతిథ్య శ్రీలంకను ఢీ కొట్టేందుకు పాకిస్థాన్ అమ్మాయిలు సిద్ధమవుతున్నారు.
డిఫెండింగ్ చాంపియన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సెమీస్ సమరంలో విజయంపై కన్నేసింది. బలాబలాల పరంగా బంగ్లా కంటే బలంగా ఉన్న టీమిండియా వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేరడం ఖాయమనిపిస్తోంది. ఆసియా కప్‌లో తిరుగులేని రికార్డు ఉన్న భారత జట్టు టైటిల్ వేటను ఘనంగా మొదలెట్టింది. ఏడు సార్లు ఆసియా కప్ గెలుపొందిన టీమిండియా తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. స్పిన్నర్ దీప్తి శర్మ (3/20) విజృంభణతో పాక్‌ను 108కే ఆలౌట్ చేసి.. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించింది.
Team India’s spin wizard is sitting comfortably at the top with 8 scalps 🙌#WomensAsiaCup2024 #ACC #HerStory pic.twitter.com/zRQJMs9xfT
— AsianCricketCouncil (@ACCMedia1) July 25, 2024
అనంతరం యూఏఈపై రికార్డు స్కోర్‌తో హర్మన్‌ప్రీత్ బృందం చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(66 నాటౌట్), రీచా ఘోష్(64 నాటౌట్)లు అర్ధ శతకాలతో చెలరేగగా ప్రత్యర్థికి 202 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. దీప్తి శర్మ(2/23) మరోసారి తప్పేయడంతో యూఏఈపై 78 పరుగుల భారీ విజయం మూటగట్టుకుంది. ఇక మూడో మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ 82 పరుగులతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది.

ప్రస్తుతం భారత జట్టులోని వాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానాలు విధ్వంసంక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్‌లు ధనాధన్ ఆడుతూ అవతలి జట్లను భయపెడుతున్నారు. ఇక బౌలింగ్ యూనిట్ సైతం పటిష్టంగా ఉంది.

పేసర్ రేణుకా సింగ్, అరుంధతీ రెడ్డి, యువ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌లు పవర్ ప్లేలోనే వికెట్లు తీసి బ్రేకిస్తున్నారు. ఇక మిడిల్ ఓవర్లలో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్‌లు తిప్పేస్తున్నారు. దాంతో.. బంగ్లాదేశ్‌తో జరిగే సెమీస్‌లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడనుంది. మరోవైపు థాయ్‌లాండ్, మలేషియాలపై గెలుపొందిన బంగ్లా.. టీమిండియాకు గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది.