హైదరాబాద్ : నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా నాడు ఫజల్ అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపిన అనంతరం ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి మరణశాసనం రాసిందని ఆయన మండిపడ్డారు. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పు, కలిపిన తర్వాత ఫజల్ అలీ కమిషన్ సూచనలకు భిన్నంగా ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను రద్దు చేసి మరణశాసనం రాయడం మరో తప్పు. ఇయ్యాల కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇయ్యాల వాళ్లు నీళ్ల గురించి మాట్లాడుతున్నరు. అసలు 600 కిలోమీటర్లు గోదావరి, 300 కిలో మీటర్లు కృష్ణానది ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం ఈ ప్రాంతాన్ని 60 ఏండ్లకుపైన పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు’ అని ఆరోపించారు.
‘గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79 శాతం ఉంటే.. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15 శాతం. కృష్ణానదిలో మన పరీవాహక ప్రాంతం 69 శాతం ఉంటే.. కాంగ్రెస్, టీడీపీల పాలనలో మనకు దక్కింది 34 శాతం. రాష్ట్ర విభజన సమయంలో కూడా సెక్షన్ 84 పెట్టి, ఆ సెక్షన్ ప్రకారం నీళ్ల విభజన చేయాలని చెప్పి మనకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో సోనియాగాంధీ మనకు రక్షణలు కల్పించింది అని చెప్పిండు. ఎక్కడున్నయ్ రక్షణలు..?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘పాలమూరు-రంగారెడ్డి పథకానికి 11వ షెడ్యూల్లో సోనియాగాంధీ రక్షణలు కల్పించింది అని రేవంత్‌రెడ్డి మాట్లాడిండు. కానీ 11వ షెడ్యూల్లో పెట్టినవి కేవలం హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు. ఇండ్ల మన తెలంగాణవి రెండే ఉన్నయ్ కల్వకుర్తి, నెట్టెంపాడు. పాలమూరు ఎత్తిపోతల పథకం లేదు. దిండి ఎత్తిపోతల పథకం లేదు. ఇయ్యాల 11వ షెడ్యూల్లో ఆ ప్రాజెక్టులు ఉండి ఉంటే మనకు అనుమతులు వచ్చేవి. ఆ ప్రాజెక్టులను మనం కొనసాగించేవాళ్లం’ అని చెప్పారు.