Bharathiraja | భారతీయ సినిమాల్లో గ్రామీణ జీవనశైలిని, సహజమైన మానవ భావోద్వేగాలను కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన దర్శకుల్లో భారతీరాజా పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. తెలుగు చిత్రం 16 ఏళ్ల వయసును తమిళంలో 16 వయదినిలేగా రీమేక్ చేస్తూ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, తొలి సినిమాతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి వంటి స్టార్ నటులు ఉండటం అప్పట్లోనే పెద్ద చర్చకు దారి తీసింది.ఆ తర్వాత భారతీరాజా వెనుదిరిగి చూడలేదు. ‘కిళక్కే పోగుం రైల్’, ‘అలైగళ్ ఓయవదిల్లై’, ‘ముదల్ మరియాదై’ వంటి సినిమాలతో తమిళ సినిమాకు కొత్త దిశ చూపించారు. కథలో సహజత్వం, పాత్రల్లో నిజాయితీ, భావోద్వేగాల్లో లోతు – ఇవే ఆయన సినిమాల గుర్తింపుగా మారాయి. అంతేకాదు, రాధిక, రాధ, కార్తీక్ లాంటి పలువురు నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా తన సత్తా చాటారు భారతీరాజా. వయసు పైబడినా కూడా పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలో ధనుష్‌కు తాత పాత్రలో కనిపించి, తన అనుభవం ఎంత గొప్పదో మరోసారి నిరూపించారు. వ్యక్తిగత జీవితంలో అయితే ఆయనకు పెద్ద దెబ్బ తగిలింది. ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా .. నటుడు, దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి కొంతకాలం కుటుంబ సభ్యుల వద్ద విదేశాల్లో గడిపిన భారతీరాజా, అనంతరం చెన్నైకి తిరిగివచ్చారు.
ప్రస్తుతం 80 ఏళ్లకు పైగా వయసున్న ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా ఐసీయూలో ఉన్నప్పటికీ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, అనవసరమైన పుకార్లను నమ్మవద్దని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. సహజత్వానికి చిరునామాగా నిలిచిన భారతీరాజా త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.